
హైదరాబాద్: న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ టోర్నీ నుంచి గాయం కారణంగా నిష్ర్కమించాడు. అర్జెంటీనా ఆటగాడు డెల్ పోట్రోతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నాదల్ మోకాలి గాయం కారణంగా ఆటను కొనసాగించలేకపోయాడు. దీంతో యుఎస్ ఓపెన్‌లో నాదల్ కథ ముగిసింది.
ఆట మధ్యలో మోకాలి గాయంతో బాధపడ్డ నాదల్ తొలి రెండు సెట్లను కోల్పోయిన తర్వాత టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తొలి సెట్‌ను 6-7(3/7) చేజార్చుకున్న నాదల్.. రెండో సెట్‌ను 2-6తో కోల్పోయాడు. ఆ తర్వాత నాదల్ మోకాలి గాయం మరింత ఇబ్బంది పెట్టడంతో టోర్నీ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు.
ఈ విధంగా గ్రాండ్ శ్లామ్ టోర్నీ నుంచి ఈ ఏడాది నాదల్ వైదొలగడం ఇది రెండోసారి. అంతకుముందు ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నాదల్ ఇలానే వైదొలిగాడు. దీంతో డెల్ పోట్రో ఫైనల్‌కు చేరాడు. 2009లో తొలిసారి యుఎస్ ఓపెన్ గెలిచిన డెల్ పోట్రో మరోసారి టైటిల్ పోరుకు సిద్దమయ్యాడు. ఆదివారం జరిగే ఫైనల్లో నొవాక్ జొకోవిచ్‌తో పాట్రో అమీతుమీ తేల్చుకోనున్నాడు.