హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరిస్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 15-21, 21-13, 21-13 తేడాతో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారుడు సన్ వాన్ హో(దక్షిణాకొరియా)పై మరోసారి సంచలన విజయం సాధించాడు.
దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరిస్ క్వార్టర్స్ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. తొలి గేమ్‌ను కోల్పోయిన శ్రీకాంత్ ఆ తర్వాత పుంజుకుని వరుసగా రెండు గేమ్‌లను సొంతం చేసుకున్నాడు. ఇటీవలే ముగిసిన ఇండోనేషియా ఓపెన్‌లో సైతం సన్ వాన్ హోపై శ్రీకాంత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఆ టోర్నీ సెమీ ఫైనల్లో సన్ వాన్ హోతో జరిగిన హోరాహోరీ పోరులో శ్రీకాంత్ పైచేయి సాధించాడు. ఆ తర్వాత ఫైనల్లో విజయం సాధించి ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ శ్రీకాంత్ సొంతం చేసుకున్నాడు. ఇక, మరో ఆటగాడు సాయి ప్రణీత్ కూడా విజయం సాధించాడు.
ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయి ప్రణీత్ 21-15, 18-21, 21-13 తేడాతో హువాంగ్ యుజియాంగ్ (చైనా)పై విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరాడు.
చైనా క్రీడాకారిణిపై పీవీ సింధు విజయం
సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ పోరులో భారత క్రీడాకారుల హవా కొనసాగుతోంది. తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. మహిళల సింగిల్స్‌లో హైదరాబాదీ పీవీ సింధు విజయం సాధించింది. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్ లో చైనా క్రీడాకారిణి చెన్ జియాజిన్‌పై 21-13, 21-18 తేడాతో గెలుపొంది క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.