హైదరాబాద్: సెలిబ్రిటీలు అనేసరికి వారి మీద పుకార్లు షికార్లు చేయడం సర్వసాధారణమే. ఇప్పుడు మీడియా టార్గెట్ టెన్నిస్ తార సానియా మీర్జా అయ్యారు. షోయబ్ మాలిక్‌కు సానియా మీర్జాకు మధ్య దూరం పెరుగుతున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిజానికి, వారిద్దరు చాలా ప్రేమాస్పదులుగా వ్యవహరిస్తూ వచ్చారు.
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి, అమితంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్న సానియా దూరం జరుగుతున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ మేరకు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. హైదరాబాద్‌లో సానియా మీర్జా నెలకొల్పనున్న టెన్నిస్ అకాడమీ వారి మధ్య దూరం పెరగడానికి కారణం కావచ్చునని అంటున్నారు. వారి మధ్య మరేమైనా విభేదాలు ఉన్నాయా అనేది కూడా సందేహాస్పదమంటూ ఓ వార్తా పత్రిక సందేహం వ్యక్తం చేసింది.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని మొయినాబాద్‌లో సానియా ఏర్పాటుచేసిన టెన్నిస్ అకాడెమీని దుబాయ్‌లో నెలకొల్పాలని తొలుత భావించారు. అయితే, పరిస్థితులు అనుకూలించక ఆ ఆకాడమీని సానియా మీర్జా ఇక్కడే ఏర్పాటు చేశారు. ఇదే దంపతుల మధ్య మనస్పర్థలకు కారణమైందని అంటున్నారు.
పాకిస్థాన్‌ను వీడి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడేందుకు షోయబ్ మాలిక్ ససేమిరా అన్నట్లు సమాచారం.
అదే సమయంలో హైదరాబాద్‌ను వీడి పాకిస్థాన్‌కు వెళ్లేందుకు సానియా ఇష్టపడటం లేదట. దీంతో వీరిద్దరు గత కొంత కాలంగా ఎడమొహం పెడమొహంగా ఉన్నట్లు చెబుతున్నారు.