ప్రస్తుతం దేశంలో క్రీడలకు బాగా ఆదరణ దక్కుతోంది. అన్ని క్రీడలపై ప్రజలు దృష్టి పెడుతున్నారు. రాణిస్తున్న క్రీడాకారులకు అండగా నిలబడుతున్నారు. కానీ ఇది పైకి కనిపిస్తున్న చిత్రమే. ఎంతగా రాణిస్తున్నా ఇప్పటికీ సరైన ఆర్థిక అండ లేని ప్లేయర్లు ఎందరో ఉన్నారు. వారిలో భారత నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్ ఒకడు.
జర్మనీలోని నాన్సెల్ టెన్నిస్ అకాడమీలో కొంతకాలంగా శిక్షణ తీసుకుంటున్న అతను.. ఈ ఏడాది ఆరంభంలో అక్కడ ఉండేందుకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డాడు. మిత్రుల సాయంతో తన ఆట గాడి తప్పకుండా జాగ్రత్తపడి, ఆ తర్వాత డబ్బులు సర్దుకొని జర్మనీలో తన ట్రైనింగ్ కొనసాగించాడు.

ఏటీపీ టూర్‌కు వెళ్లేందుకు కేవలం ఒక్క కోచ్‌తోనే వెళ్లినా ఏడాదికి రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు అవుతోందని సుమిత్ చెప్పాడు. దీంతో తనకు టోర్నమెంట్లలో వస్తున్న డబ్బులు మొత్తం ఖర్చయిపోతున్నాయని తెలిపాడు. ప్రస్తుతం తన బ్యాంక్ అకౌంట్‌లో కేవలం రూ.80 వేలు మాత్రమే ఉన్నాయని వాపోయాడు.
'ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్‌లో చూస్తే.. ఏడాది ఆరంభంలో ఉన్నట్లే 900 యూరోలు (సుమారు రూ.80 వేలు) మాత్రమే ఉన్నాయి. నాకు కొందరు సాయం చేస్తున్న మాట వాస్తవమే. మహా టెన్నిస్ ఫౌండేషన్‌తో ప్రశాంత్ సుతర్ నాకు అండగా ఉన్నారు. అలాగే ఐఓసీఎల్ నుంచి జీతం వస్తుంది. కానీ నాకు బడా స్పాన్సర్ ఎవరూ లేరు' అని సుమిత్ వెల్లడించాడు.
సుమిత్ వాడే టెన్నిస్ రాకెట్, షూస్ తదితర వస్తువులను యానెక్స్, యాసిక్స్ (ఏఎస్ఐసీఎస్) కంపెనీలు అందజేస్తున్నాయి. ఈ ఏడాది సుమిత్ ఏకంగా 24 టోర్నమెంట్లలో ఆడాడు. భారత్ నుంచి గ్రాండ్‌స్లామ్స్ ఆడుతున్న ఏకైక సింగిల్స్ ప్లేయర్ సుమిత్ ఒక్కడే. తాజాగా యూఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లో ఓడిన అతనికి 22 వేల డాలర్లు (సుమారు రూ.18 లక్షలు) ప్రైజ్ మనీ వచ్చింది.
ఇలా తనకు వచ్చిన డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నట్లు సుమిత్ చెప్పాడు. 'ఫిజియోలు లేకుండా.. కేవలం ఒక్క కోచ్‌ను మాత్రమే వెంట పెట్టుకొని ఏడాదంతా టోర్నమెంట్ల కోసం వెళ్తుంటేనే రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు అవుతోంది. అందుకే నాకు వచ్చే డబ్బులను దీనికి వాడుకుంటున్నా' అని చెప్పుకొచ్చాడు.
'గత కొన్నేళ్లుగా భారత్‌లో నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్‌గా ఉన్నా. కానీ నాకు ఎలాంటి సపోర్ట్ దక్కడం లేదనిపిస్తోంది. గ్రాండ్‌స్లామ్స్ ఆడేందుకు క్వాలిఫై అవుతున్న ఒకే ఒక్క ప్లేయర్‌ను నేను. గత కొంతకాలంగా ఒలింపిక్స్‌లో భారత్ తరఫున టెన్నిస్ మ్యాచ్ గెలిచింది కూడా నేనొక్కడినే. అయినా నాకు దక్కాల్సిన సహకారం అందడం లేదు' అని సుమిత్ ఆవేదన వ్యక్తం చేశాడు.