హైదరాబాద్: గత వారం రోజులుగా సాఫీగా సాగిన వింబుల్డన్ టోర్నీలో సోమవారం సంచలనాలు నమోదయ్యాయి. పదో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి వింబుల్డన్‌లో ఫేవరెట్లలో ఒకడిగా బరిలోకి దిగిన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలయ్యాడు.
లక్సెంబర్గ్‌కు చెందిన 16వ సీడ్ గైల్స్ ముల్లర్ అసమాన ఆటతీరుతో స్పెయిన్ బుల్‌పై ఘన విజయం సాధించాడు. నాలుగు సెట్లు.. ఆపై సుదీర్ఘంగా సాగిన ఐదో సెట్ టైబ్రేకర్.. అందులో క్షణక్షణం మారిన ఆధిక్యం.. ఇలా ముల్లర్‌తో నాదల్ ప్రిక్వార్టర్స్ పోరు ఉత్కంఠభరితంగా సాగింది.
వింబుల్డన్ టోర్నీకే ఈ మ్యాచ్ హైలెట్‌గా నిలిచింది. సుమారు 4 గంటల 47 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో చివరకు ముల్లర్ 6-4, 6-3, 3-6, 4-6, 15-13తో విజేతగా నిలిచాడు. తొలి రెండు సెట్లను ముల్లర్ 6-3, 6-4తో నెగ్గి నాదల్‌ను ఒత్తిడికి గురి చేశాడు.
ఆ తర్వాత రఫెల్ నాదల్ 6-3, 6-4తో తర్వాతి రెండు సెట్లను నెగ్గి మ్యాచ్‌ను ఐదో సెట్‌గా తీసుకెళ్లాడు. దీంతో ఐదో సెట్‌లో నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీగా సాగింది. ఒక్క ఐదో సెట్ మాత్రమే 135 నిమిషాలపాటు సాగడం విశేషం. అయితే చివరి సెట్‌ను గైల్స్ ముల్లర్ 15-13తో సొంతం చేసుకున్నాడు.
దీంతో వింబుల్డన్ టోర్నీ నుంచి నాదల్ నిష్క్రమించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ "నేను మళ్లీ రానని చెప్పడం లేదు. సెంట్రల్ కోర్టులో మరిన్ని గేమ్స్ ఆడేందుకు మళ్లీ వస్తా' అని 2008, 2010లో వింబుల్డన్ ఛాంపియన్‌గా నిలిచిన నాదల్ పేర్కొన్నాడు.
"గ్రేట్ ఫీలింగ్. చక్కటి వాతావరణం. కోర్టులో శాయశక్తులా ఆడేందుకు ప్రయత్నించా. ఎంతో ఆసక్తిగా ఆడా. మ్యాచ్‌ని వీక్షించడానికి వచ్చిన అభిమానులు కూడా అభినందించారు" అని నాదల్ తెలిపాడు. ఇదిలా ఉంటే నాదల్‌ని ఇంటికి పంపించిన ముల్లర్‌కి ఇది తొలి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ కావడం విశేషం.