ప్రత్యేకం: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీకి 140 ఏళ్లు
హైదరాబాద్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీకి నగారా మోగింది. సుధీర్ఘ చరిత్ర కలిగిన వింబుల్డన్ ట్రోఫీని దక్కించుకోవాలనేది టెన్నిస్ ఆడే ప్రతి క్రీడాకారుడి కల. అలాంటి వింబుల్డన్ టోర్నీ లండన్ వేదికగా సోమవారం నుంచి ప్రారంభం కానుంది. నాలుగు గ్రాండ్ స్లామ్స్‌లో ఒకటైన ఈ వింబుల్డన్‌కు ఈసారి ఓ ప్రత్యేకత ఉంది.
ప్రస్తుతం జరిగే టోర్నీ 140వ వింబుల్డన్ టోర్నీ. అంటే వింబుల్డన్‌ను ప్రారంభించి 140 ఏళ్లు పూర్తయింది. సోమవారం (జులై 3) 140 వింబుల్డన్ టోర్నీ ఆరంభమవుతోంది. జులై 15 వరకు ఈ టోర్నీ జరుగనుంది. లండన్‌లోని వింబుల్డన్ స్టేడియంలో ఏటా జరిగే ఈ వింబుల్డన్ చాంపియన్‌షిప్స్ టోర్నీని 1877లో తొలిసారి నిర్వహించారు.
ప్రపంచంలోనే అత్యంత పురాతన టెన్నిస్ టోర్నమెంట్ ఇది. వింబుల్డన్ పోటీలను గ్రాస్ కోర్టుపై నిర్వహిస్తారు. 1877 జులై 9న నిర్వహించిన తొలి టోర్నీలో కేవలం పురుషుల సింగిల్స్ మాత్రమే నిర్వహించారు. తొలి టైటిల్‌ను ఇంగ్లండ్‌కు చెందిన స్పెన్సర్ విలియమ్ గోర్ గెలుపొందారు.

ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని 7 సార్లు గెలిచిన రోజర్ ఫెదరర్
పురుషుల సింగిల్స్ విభాగంలో వింబుల్డన్‌ను అత్యధిక సార్లు గెలుచుకున్న ఆటగాళ్లలో విలియమ్ రెన్షా, పీట్ సంప్రాస్, రోజర్ ఫెదరర్‌లు ఉన్నారు. వీరు ముగ్గురూ ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని 7 సార్లు సొంతం చేసుకున్నారు. ఇక మహిళ సింగిల్స్‌ను మార్టినా నవ్రతిలోవా అత్యధికంగా 9 సార్లు కైవసం చేసుకుంది.

రసవత్తరంగా ఈ ఏడాది పోరు
దీంతో ఈ ఏడాది వింబుల్డన్ పురుషుల పోరు రసవత్తరంగా ఉండనుంది. ఈ టైటిల్‌ను ఏడుసార్లు గెలుచుకున్న రోజర్ ఫెదరర్ ఈసారి కూడా ఫేవరెట్‌గా బరిలో దిగుతున్నాడు. ఈ పర్యాయం ఎనిమిదో టైటిల్ నెగ్గి రికార్డు చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అంతేకాదు ఈ టైటిల్ గెలిచిన పెద్ద వయస్కుడిగా కూడా నిలిచే అవకాశం రోజర్ ముందుంది.

టైటిల్ ఫేవరెట్లలో రఫెల్ నాదల్
ప్రస్తుతం రోజర్ వయసు 35 ఏళ్లు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి అందర్ని ఆశ్చర్యపరిచిన ఫెదరర్ తాజాగా హాలె టోర్నీలో అద్భుతంగా ఆడి టైటిల్ నెగ్గాడు. మరోవైపు ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన రఫెల్ నాదల్ కూడా జోరు మీదున్నాడు. టైటిల్ ఫేవరెట్లలో అతనొకడు. అయితే క్లే కోర్టులపై ఉన్న ఫామ్‌ను గ్రాస్ కోర్టులపై ఏ మేరకు చూపిస్తాడన్నదే కీలకం.

గూగుల్ ప్రత్యేక డూడుల్‌తో
మరోవైపు ఆండీ ముర్రే డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్నాడు. టాప్‌సీడ్ ముర్రే, రెండో సీడ్ జొకోవిచ్‌లు ట్రోఫీ నెగ్గాలంటే.. ముందుగా ఫెదరర్, నాదల్‌ను ఓడించాలి. ఎందుకంటే డ్రా ప్రకారం వీళ్లిద్దరికి రోజర్, రఫా ఎదురుపడే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. వింబుల్డన్ 140 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్‌తో గౌరవించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications