హైదరాబాద్: రష్యా టెన్నిస్ స్టార్, మాజీ ఛాంపియన్ అందాలతార మరియా షరపోవా పోరాటం ముగిసింది. ఎన్నో ఆశలతో ఫ్రెంచ్ ఓపెన్‌లో అడుగుపెట్టిన మారియా షరపోవాకు నిరాశే ఎదురైంది. మూడో సీడ్, స్పెయిన్ స్టార్ గార్బిన్ ముగురుజాతో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో షరపోవా 6-2,6-1 తేడాతో పరాజయం పాలైంది. వరుస సెట్లలో షరపోవాపై ముగురుజా సునాయస విజయం సాధించింది.
క్లే కోర్టుపై అద్భుతంగా ఆడే షరపోవాను వరుససెట్లలో ఓడించిన ముగురుజా అబ్బురపరిచింది. ఇప్పటివరకు ఒక్కసెట్ కూడా కోల్పోకుండా సెమీస్ చేరడం గమనార్హం. 2016లో ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ముగురుజా గతేడాది వింబుల్డన్‌లోనూ విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో షరపోవా 6 డబుల్ఫాల్ట్స్తోపాటు 27 అనవసర తప్పిదాలతో.. ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ ఛాంపియన్ సెరెనా విలియమ్స్ భుజం కండరాలు పట్టేయడంతో షరపోవాకు వాకోవర్ ఇచ్చింది. దీంతో ఈ మ్యాచ్ ఆడకుండానే షరపోవా క్వార్టర్‌ఫైనల్‌కు చేరిన విషయం తెలిసింది.
హలెప్ హవా..
ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్నా... ఎంతోకాలంగా ఊరిస్తోన్న గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఈ సారైనా నెగ్గాలనే పట్టుదలతో ఉన్న సిమోనా హలెప్ తన హవా కొనసాగిస్తోంది. ఎలాంటి అలసత్వానికి తావీయకుండా ఆడిన టాప్‌సీడ్, రొమేనియా టెన్నిస్‌స్టార్ సిమోన్ హాలెప్ ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ చేరుకుంది. బుధవారం జర్మనీ అమ్మాయి, 12వ సీడ్ ఏంజెలిక్ కెర్బర్‌ను 6-7(2-0),6-3,6-2స్కోరుతో ఓడించింది.
కెర్బర్ జోరు చూపించడంతో వీరిద్దరి మధ్య జరిగిన క్వార్టర్స్ పోరు 2గంటల 14 నిమిషాల పాటు కొనసాగింది. తొలిసెట్ చేజారినా వెరువని హాలెప్ వరుసగా రెండుసెట్లు గెలుచుకుని కెర్బర్‌పై జయకేతనం ఎగురవేసింది. 'ఇది నా మానసిక విజయం. నా ఆటతోపాటు ఆలోచనల దృఢత్వం నన్ను గెలిపించింది' అని హాలెప్ వ్యాఖ్యానించింది. ఇక హలెప్ సెమీ ఫైనల్లో స్పెయిన్ స్టార్ గార్బిన్ ముగురుజాతో తలపడనుంది.