
హైదరాబాద్: క్రీడాస్ఫూర్తిని మరిచాడొక టెన్నిస్ ప్లేయర్ ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. గెలుపోటములు సహజమైన క్రీడల్లో ఆవేశాన్ని అదుపుచేసుకోకుండా ఆడే రాకెట్‌పైనే చూపించాడు. ఒక్కోసారి తమ ఓటమిని భరించలేకపోవడానికి వాస్తవమైనప్పటికీ సహనం కోల్పోయి ఆకతాయిలా ప్రవర్తించాడు. తాజాగా ఓ క్రీడాకారుడు ఇదే చేశాడు. ఫలితం నిబంధనలు ఉల్లంఘించాడంటూ అతడిపై నిర్వాహకులు భారీ జరిమానా విధించారు.
అసలేం జరిగిందంటే.. 'వాష్టింగ్టన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్' పురుషుల సింగిల్స్ విభాగంలో బెనాయిట్ పైరే(పారిస్)- మార్కస్(సైప్రస్)తో తలపడ్డాడు. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఈ క్రమంలో తొలి సెట్‌ను పైరే 3-6తో కోల్పోయాడు. అనంతరం రెండో సెట్‌ను 6-3తో సొంతం చేసుకున్నాడు. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లోనే వచ్చింది చిక్కు.
తొలి రెండు రౌండ్లు చెరొకటి అయినప్పటికీ గేమ్ నిర్దేశించే ఆఖరి రౌండ్లో పైరే పాయింట్లు సాధించడంలో విఫలమయ్యాడు. 2-5తో వెనుబడిన సమయంలో పైరే సహనం కోల్పోయాడు. చేతిలోని రాకెట్‌ను నేలకేసి పలుమార్లు బాదాడు. ఆ తర్వాత 2-6తో మ్యాచ్ కోల్పోయిన సమయంలోనూ పైరే రాకెట్‌ను బలంగా విసిరాడు. అనంతరం ప్రత్యర్థి ఆటగాడిని అభినందించి తన బ్యాగ్ సర్దుకుని వెళ్లిపోయాడు.
రాకెట్‌ను పలుమార్లు నేలకేసి బాదడం, మ్యాచ్ అనంతరం తనకు తానుగా అలా వెళ్లిపోవడం నిబంధనలకు విరుద్ధం. దీంతో టోర్నీ నిర్వాహకులు అతనికి 16,500 డాలర్ల జరిమానా విధించారు. అంతేకాదు, అతని ఆవేశాన్ని స్టేడియంలో గేమ్ వీక్షించిన ప్రేక్షకులు సైతం విమర్శిస్తుండగా నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.