ఫ్రెంచ్ ఓపెన్: తొలిరోజే సంచలనం, నెం.1 ర్యాంకర్ కెర్బర్ ఓటమి
హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిరోజే అతిపెద్ద సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ ఏంజెలికా కెర్బర్‌కు ఊహించని షాక్ తగిలింది. తొలిరౌండ్లో రష్యా అమ్మాయి ఎకటరీనా మకరోవా చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. తద్వారా వరుసగా రెండో ఏడాది తొలి రౌండ్లోనే కెర్బర్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంది.
ఆదివారం సాయంత్రం ఇక్కడి రోలాండ్ గారోస్‌లో జరిగిన మ్యాచ్‌లో రష్యాకు చెందిన ప్రపంచ 40వ ర్యాంకర్ మకరోవా చేతిలో 6-2, 6-2 తేడాతో కెర్బర్(జర్మనీ) ఓటమి పాలైంది. ఈ పరాజయంతో తన నంబర్‌వన్ ర్యాంక్‌కు ముప్పు తెచ్చుకున్న కెర్బర్.. ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టిన తొలి టాప్‌సీడ్ క్రీడాకారిణిగా పేలవమైన రికార్డును మూటగట్టుకుంది.
గంటా 23 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి కూడా మకరోవాదే ఆధిపత్యం. తొలి సెట్ తొలి గేమ్‌లోనే కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన మకరోవా ఐదో గేమ్‌లో మరో బ్రేక్ పాయింట్‌తో అలవోకగా సెట్ గెలుచుకుంది. ఇదే ఊపులో రెండో సెట్ 1, 3 గేముల్లో మకరోవా బ్రేక్ పాయింట్లు సాధించి 3-0 ఆధిక్యంలో నిలిచిన మకరోవా 6-3తో సెట్‌ను గెలిచి మ్యాచ్‌ను ముగించింది.

తొలి రౌండ్లోనే ఓడిన తొలి ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన కెర్బర్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ప్రొఫెషనల్ ఈవెంట్ (1968 నుంచి)గా మారిన తర్వాత ఇక్కడ తొలి రౌండ్లోనే ఓడిన తొలి ప్రపంచ నంబర్‌వన్‌గా కెర్బర్ నిలిచింది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించిన కెర్బర్.. ఫ్రెంచ్ ఓపెన్ ముగిసిన వెంటనే తన టాప్‌ర్యాంక్‌ను సిమోనా హాలెప్ లేదా కరోలినా ప్లిస్కోవాకు కోల్పోయే అవకాశముంది.

ఈ సీజన్‌లో అంతగా ఆకట్టుకోని కెర్బర్ ప్రదర్శన
గతేడాది రెండు గ్రాండ్‌స్లామ్స్ (ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్) టైటిళ్లు సాధించి అలరించిన 29 ఏళ్ల కెర్బర్ ఈ సీజన్‌లో అంతగా ఆకట్టుకోవడం లేదు. సీజన్ తొలిగ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన కెర్బర్ టైటిల్ నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత జరిగిన బ్రిస్బేన్, కతార్, స్టట్‌గర్ట్ ఈవెంట్లలో పోటీపడ్డా కనీసం ఫైనల్ కూడా చేరుకోలేకపోయింది.

ఫ్రెంచ్ ఓపెన్‌లో శుభారంభం చేసిన క్విటోవా
మరోవైపు గతేడాది డిసెంబర్లో కత్తి పోటుకు గురవడంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన వింబుల్డన్ మాజీ ఛాంపియన్ క్విటోవా.. ఫ్రెంచ్ ఓపెన్‌లో శుభారంభం చేసింది. ఆమె 6-3, 6-2తో అమెరికా క్రీడాకారిణి బోస్‌రప్‌పై ఘనవిజయం సాధించింది. గత డిసెంబర్‌లో తాను ఇంట్లో ఉన్న సమయంలో దొంగతనానికి వచ్చి న ఓ ఆగంతకుడిని అడ్డుకోబోయిన క్విటోవా అతని చేతిలో కత్తిదాడికి గురైంది.

జూలియా బోసర్ప్‌పై విజయం
దీంతో క్విటోవా ఎడమ చేతికి తీవ్రగాయమైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆటకు దూరంగా ఉన్న ఈ చెక్ రిపబ్లిక్ భామ దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్‌తో రాకెట్ పట్టింది. పునరాగమనంలో ఆడిన తొలి మ్యాచ్‌ను క్విటోవా ది గ్విజయంగా అధిగమించింది. ఆదివారం జరిగిన తొలిరౌండ్లో క్విటోవా 6-3, 6-2తో అమెరికాకు చెందిన జూలియా బోసర్ప్‌ను వరుససెట్లలో ఓడించి రెండోరౌండ్ చేరింది.

కన్నీటి పర్యంతమైన క్విటోవా
గెలిచిన వెంటనే ఉద్వేగంతో కోర్టులోనే కన్నీటి పర్యంతమైన క్విటోవా.. మళ్లీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. దాడి ఘటన తర్వాత మళ్లీ టెన్నిస్ ఆడాలన్న నా నిర్ణయం సరైందే అని ఇప్పుడు అనుకుంటున్నా అని వ్యాఖ్యానించింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సెరెనా విలియమ్స్, షరపోవా గైర్హాజరీతో కచ్చితమైన ఫేవరెట్ కనిపించడంలేదు. ఇప్పుడు కెర్బర్ కూడా సాధారణ ప్రదర్శనతో తొలి రౌండ్లోనే ఓడిపోయి ఇంటి దారి పట్టడం అభిమానులను నిరాశకు గురి చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications