మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతున్న స్విట్జర్లాండ్ స్టార్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ ఫెదరర్ 6-2, 6-4, 6-4తో లొరెంజో సొనెగొ (ఇటలీ)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్‌లో రోజర్ ఐదు ఏస్‌లతో పాటు 36 విన్నర్లు సంధించాడు. 91 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫెడరర్‌కు తొలి రౌండ్లో వరుసగా 60వ విజయం.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో గ్రీకు వీరుడు స్టెఫానోస్ సిట్సిపాస్ కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. సిట్సిపాస్ 6-2, 6-2, 7-6 (7-4)తో మార్టెనెర్ (జర్మనీ)ని పై గెలిచాడు. సిలిచ్ (క్రొయేషియా), దిమిత్రోవ్ (బల్గేరియా), నిషికోరి (జపాన్) కూడా ముందంజ వేశారు. నిషికోరి 6-2, 6-3, 6-4తో క్వెంటన్ హాలిస్ (ఫ్రాన్స్)పై, సిలిచ్ 6-3, 7-5, 6-1తో ఫాబియానో (ఇటలీ)పై గెలిచారు.
పురుషుల సింగిల్స్ బరిలో ఉన్న భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. గుణేశ్వరన్ 1-6, 3-6, 1-6తో హుగో డెలియన్ (బొలీవియా) చేతిలో ఓటమిని ఎదుర్కొన్నాడు. 75 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ 34 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయాడు. దీంతో గుణేశ్వరన్ వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లోనూ తొలి రౌండ్ దాటలేకపోయాడు. అయితే డబుల్స్‌లో లియాండర్ పేస్, దివిజ్ శరణ్, రోహన్ బోపన్న, జీవన్ నెడుంచెజియన్ బరిలో ఉన్నారు.