French Open 2025: ఫ్రెంచ్ ఓపెన్ 2025 సెమీ-ఫైనల్స్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపాయి. పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో జరిగిన ఈ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు అంచనాలకు తగ్గకుండా తీవ్ర ఉత్కంఠతో సాగాయి. ఫురుషుల సింగిల్స్ సెమీ-ఫైనల్స్‌లో టాప్ సీడ్ జాన్సిక్ సినర్, డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్ అద్భుతమైన విజయాలు సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లారు.
జాన్సిక్ సినర్ వర్సెస్ నొవాక్ జకోవిచ్: అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఈ పోరులో టాప్ జాన్సిక్ సినర్ పైచేయి సాధించాడు. ప్రపంచ నంబర్ వన్ సినర్, 24 సార్లు గ్రాండ్ స్లామ్ విజేత జకోవిచ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో జాన్సిక్ సినర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. సినర్ జకోవిచ్‌ను స్ట్రెయిట్ సెట్స్‌లో (6-4, 7-5, 7-6(7-3)) ఓడించి సంచలనం సృష్టించాడు. ఈ విజయం సినర్‌కు తొలి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు మార్గం సుగమం చేసింది. జకోవిచ్ తనదైన శైలిలో కొన్ని అద్భుతమైన షాట్‌లు ఆడినప్పటికీ, సినర్ నిలకడైన ఆటతీరు ముందు నిలబడలేకపోయాడు. 2010 వింబుల్డన్ తర్వాత జకోవిచ్ ఒక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లో స్ట్రెయిట్ సెట్స్‌లో ఓడిపోవడం ఇదే మొదటిసారి. ఈ సీజన్లో గత 4 మ్యాచ్‌ల్లోనూ సినర్ చేతిలో జకోవిచ్ ఓడిపోయాడు.

కార్లోస్ అల్కరాజ్ వర్సెస్ లొరెంజో ముసెట్టి: డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్ మరోసారి తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. లొరెంజో ముసెట్టి గాయం కారణంగా మధ్యలోనే వైదొలగడంతో అల్కరాస్ ఫైనల్‌కు చేరుకున్నాడు. లొరెంజో ముసెట్టి 4-6, 7-6,6-0, 2-0 తేడాతో వెనుకబడి ఉన్న సమయంలో గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగాడు. మొదటి రెండు సెట్‌లు ఉత్కంఠగా సాగినప్పటికీ, ముసెట్టి గాయపడటంతో మ్యాచ్ ఏకపక్షంగా మారింది. అల్కారాజ్ తన వరుసగా రెండవ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం.
మహిళల సింగిల్స్‌లో ఫైనల్‌కు సబాలెంకా, గౌఫ్
మహిళల సింగిల్స్ విభాగంలో కూడా హోరాహోరీ పోరు కనిపించింది. అరినా సబాలెంకా, కోకో గౌఫ్ ఫైనల్‌లో తలపడనున్నారు.
అరినా సబాలెంకా వర్సెస్ ఇగా స్వైటెక్: ప్రపంచ నంబర్ 1 అరినా సబాలెంకా మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ ఇగా స్వైటెక్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. 7-6(1), 4-6, 6-0 తేడాతో సబాలెంకా విజయం సాధించింది. స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుసగా 26 విజయాల పరంపరకు సబాలెంకా బ్రేక్ వేసింది. ఈ మ్యాచ్ మహిళల టెన్నిస్‌లో రెండు అగ్రశ్రేణి క్రీడాకారుల మధ్య జరిగిన పోరాటానికి నిదర్శనం.
కోకో గౌఫ్ వర్సెస్ లోయిస్ బోయిసన్: యువ సంచలనం కోకో గౌఫ్, వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లోయిస్ బోయిసన్‌ను 6-1, 6-2 తేడాతో సునాయాసంగా ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. బోయిసన్ ఈ టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి సెమీ-ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, గౌఫ్ ముందు నిలబడలేకపోయింది. గౌఫ్ తన కెరీర్‌లో రెండవ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ కోసం ప్రయత్నిస్తోంది.
ఫ్రెంచ్ ఓపెన్ 2025 ఫైనల్స్ మరింత ఉత్కంఠను రేపనున్నాయి. పురుషుల విభాగంలో సినర్, అల్కరాస్‌ల మధ్య పోరు, మహిళల విభాగంలో సబాలెంకా, గౌఫ్‌ల మధ్య ఫైనల్ మ్యాచ్‌లను చూసేందుకు టెన్నిస్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.