French Open 2025: టెన్నిస్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రెంచ్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ ఫైనల్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ప్రపంచ నంబర్ 1 జానిక్ సినర్(ఇటలీ), డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్(స్పెయిన్) మధ్య ఈ ప్రతిష్టాత్మక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ టెన్నిస్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. ఎందుకంటే 2000వ సంవత్సరంలో పుట్టిన ఈ ఇద్దరు ఆటగాళ్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌లో తలపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
సెమీ ఫైనల్స్‌లో ఇలా..
జానిక్ సినర్ సెమీఫైనల్‌లో దిగ్గజ ఆటగాడు, 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత నొవాక్ జకోవిచ్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. జానిక్ సినర్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్‌కు చేరుకోవడం అతని ఆధిపత్యాన్ని తెలియజేస్తోంది. జానిక్ సినర్ సర్వీసులు, బేస్‌లైన్ ప్లే ఈ టోర్నమెంట్‌లో నిలకడగా ఉన్నాయి. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్ సెమీఫైనల్‌లో లొరెంజీ ముసెట్టి గాయం కారణంగా మ్యాచ్ నుంచి తొలగిపోవడంతో ఫైనల్‌కు అర్హత సాధించాడు. అల్కరాస్ గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా మట్టి కోర్టులపై తన పట్టును నిరూపించుకున్నాడు. అల్కరాస్ వేగం, డ్రాప్ షాట్లు, పవర్‌ఫుల్ ఫోర్‌హ్యాండ్‌లు ప్రత్యర్థులకు సవాలుగా నిలుస్తాయి.

హెడ్ టు హెడ్ రికార్డ్స్
సినర్, అల్కరాస్ మధ్య ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో అల్కరాస్ 7-4 ఆధిక్యంలో ఉన్నాడు. ఈ ఏడాది జరిగిన ఇటాలియన్ ఓపెన్ ఫైనల్‌లో కూడా అల్కరాస్ సినర్‌ను ఓడించాడు. అయితే గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌లో వీరు తలపడటం ఇదే మొదటిసారి.
మైలురాళ్లు, రికార్డులు
జానిక్ సినర్ తన కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం, మొదటి ఫ్రెంచ్ ఓపెన్ కోసం చూస్తున్నాడు. అతను వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచే అవకాశం కూడా ఉంది. అల్కరాస్ తన ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అల్కరాస్ 2008లో నాదల్ తర్వాత ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన అతి పిన్న వయస్కుడిగా నిలిచే అవకాశం ఉంది. ఈ యువ సంచలనాలు తమదైన ప్రత్యేక శైలితో అద్భుతంగా ఆడే అవకాశం ఉంది.సినర్ దూకుడు, నిలకడైన ఆటతీరుకు, అల్కరాస్ అద్భుతమైన అథ్లెటిసిజం, సృజనాత్మక షాట్‌లు ఎలా ఎదురొడ్డి నిలుస్తాయో చూడాలి. ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీలివ్, ఫాన్‌కోడ్, జియో టీవీలలో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.