44 ఏళ్ల వయసులోనూ భారత దిగ్గజ ప్లేయర్ రోహన్ బోపన్న సత్తాచాటుతున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో పురుషుల డబుల్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో బెల్జియం ద్వయం సాండర్-వీజెన్‌ను బోపన్న జోడీ 7-6 (7-3), 5-7, 6-1 తేడాతో చిత్తుచేసి ఘన విజయం సాధించింది.
హోరాహోరీ సాగిన తొలి సెట్‌లో బోపన్న జోడీ టైబ్రేకర్‌లో నెగ్గింది. కానీ రెండో సెట్‌ను కోల్పోయింది. అనవసర తప్పిదాలతో ప్రత్యర్థి పైచేయి సాధించే అవకాశాలు కల్పించింది. కానీ నిర్ణయాత్మక ఆఖరి సెట్‌లో బోపన్న ద్వయం అదరగొట్టింది. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో బోపన్న భారత ప్లేయర్ శ్రీరామ్ బాలాజీతో బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే మెక్సికో ఆటగాడితో ఫ్రెంచ్ ఓపెన్ ఆడిన శ్రీరామ్ మూడో రౌండ్‌లో బోపన్న-ఎబ్డెన్ చేతిలోనే ఓటమిపాలయ్యాడు.

ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్‌లో సంచలనాలు నమోదయ్యాయి. రష్యా టీనేజర్ మిరా ఆంద్రీవా సెమీస్‌కు చేరింది. క్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్2 ర్యాంకర్ సబలెంకా (బెలారస్)ను 6-7 (5-7), 6-4, 6-4 తేడాతో ఓడించింది. మరో క్వార్టర్ ఫైనల్‌లో స్టార్ ప్లేయర్ రిబాకినా (కజికిస్థాన్)కు పౌలీ (ఇటలీ) గట్టిషాక్ ఇచ్చింది. 6-2, 4-6, 6-4 తేడాతో రిబాకినాను ఓడించి సెమీఫైనల్స్‌కు చేరింది. కాగా, ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో మిరా ఆంద్రీవా, పౌలీ సెమీస్‌కు చేరడం ఇదే ప్రథమం.
మరోవైపు మెన్స్ సింగిల్స్‌లో స్పెయిన్ ప్లేయర్ అల్కరాస్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాడు. గ్రీస్ ఆటగాడు సిట్సిపాస్‌పై 6-3, 7-6 (7-3), 6-4తో విజయం సాధించాడు. సెమీస్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ)తో తలపడనున్నాడు.