
మట్టికోర్టుకు రారాజు నాదల్ మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ముద్దాడాడు. తనకు ఎదురేలేదని మరోసారి చాటిచెప్పాడు. రోలాండ్ గ్యారోస్ వేదిక మీద అతను ఎంతటి తోపో మరోసారి రుజువు చేశాడు. ఇక ఫ్రెంచ్ ఓపెన్- 2022 పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో కాస్పర్ రూడ్‌పై రాఫెల్ నాదల్ అద్భుత విజయం సాధించాడు. నార్వేకు చెందిన కాస్పర్ రూడ్.. స్పెయిన్ బుల్ నాదల్ ఎటాకింగ్ ముందు నిలవలేకపోయాడు. 6-3, 6-3, 6-0 తేడాతో నాదల్ అలవోకగా గెలుపొందాడు. తద్వారా రికార్డ్ స్థాయిలో 14సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన ప్లేయర్‌గా నాదల్ రికార్డులకెక్కాడు. ఈ విజయంతో నాదల్ గ్రాండ్ స్లామ్ విజయాల సంఖ్య కూడా 22కి చేరుకుంది. ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన అత్యంత వయస్కుడిగా కూడా నాదల్ చరిత్రలో నిలిచాడు.
ఇకపోతే ఈ మ్యాచ్‌లో సెకండ్ సర్వ్ ప్రారంభంలోనే బ్రేక్ అయినప్పటికీ.. నాదల్ రెండో సెట్‌ను 6-3తో ముగించాడు. అంతకుముందు రూడ్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసిన నాదల్ తొలి సెట్‌ను 6-3తో గెలుచుకున్నాడు. చివరి సెట్లో పూర్తిగా అలిసిపోయినట్లు కన్పించిన కాస్పర్ రూడ్.. నాదల్ ధాటికి తాళలేకపోయాడు. ఇక 6-0తేడాతో సెట్ సమర్పించుకున్నాడు. నాదల్ విజయంతో కోర్ట్ ఫిలిఫ్ చాట్రియర్‌లో సంబరాలు మొదలయ్యాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక తాజా విజయంతో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను ఒకే సంవత్సరంలో తొలిసారి నాదల్ సాధించాడు. ఇకపోతే సెమీ ఫైనల్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో పోటీ పడ్డ రాఫెల్ నాదల్ అనూహ్యంగా విన్నర్‌గా ఎంపికయ్యాడు. రెండవ సెట్‌లో మధ్యలోనే జ్వెరెవ్ గాయపడి ఆడలేక కోర్టు నుంచి వైదొలగడంతో రాఫెల్ నాదల్ విన్నర్ గా నిలిచాడు. మరోవైపు సెమీస్‌లో కాస్పర్ రూడ్.. మారిన్ సిలిక్‌ను ఓడించి ఫైనల్ చేరుకున్నాడు. ఇక ఫైనల్లో నాదల్ తన హవా కొనసాగించి గెలుపొందాడు.