
పారిస్: ప్రపంచ 85వ ర్యాంకర్ తమార జిదాన్‌చెక్ (స్లొవేనియా) ఫ్రెంచ్ ఓపెన్ 2021 సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గ్రాండ్‌స్లామ్‌తో పాటు డబ్ల్యూటీఏ మేజర్ టోర్నీల్లోనూ ఇప్పటి వరకు రెండో రౌండ్ దాటలేకపోయిన 23 ఏళ్ల జిదాన్‌చెక్.. మట్టి కోర్టులో అద్భుత ప్రదర్శనతో 'ఫైనల్ ఫోర్'లో అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జిదాన్‌చెక్ 7-5, 4-6, 8-6తో పౌలా బడోసా (స్పెయిన్)పై విజయం సాధించింది. సెమీస్‌లో అనస్తసియా పవ్ల్యూచెంకోవాతో జిదాన్‌చెక్ అమీతుమీ తేల్చుకోనుంది. ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్న తొలి స్లొవేనియా క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది.
అనస్తేసియా పవ్లిచెంకోవా (రష్యా) తుది నాలుగు జాబితాలో చోటు దక్కించుకుంది. నువ్వానేనా అన్నట్లు సాగిన క్వార్టర్స్ సమరంలో పవ్లిచెంకోవా 7-6 (2/7), 6-2, 9-7తో ఎలీనా రిబకీనా (ఉక్రెయన్)పై విజయం సాధించింది. తొలి సెట్‌లో మెరుగ్గానే ఆడినా టైబ్రేకర్‌లో ఓడిన పవ్లిచెంకోవా.. రెండో సెట్ నుంచి దూకుడుగా ఆడింది. మెరుపు విన్నర్లతో పాటు డ్రాప్ షాట్లతో పాయింట్లు సాధించి రెండో సెట్‌ను చేజిక్కించుకుని మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్ రంజుగా సాగింది. స్కోరు 7-7తో సమంగా ఉన్న స్థితిలో వరుసగా రెండు పాయింట్లు సాధించిన పవ్లిచెంకోవా సెట్‌ను, మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. రిబకీనా పవ్లిచెంకోవాకు డబుల్స్ భాగస్వామి కావడం విశేషం.
టైటిల్ నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇగా స్వైటెక్ (పోలెండ్) క్వార్టర్‌ఫైనల్ చేరింది. ప్రిక్వార్టర్స్‌లో ఈ ఎనిమిదో సీడ్ 6-3, 6-4తో మార్టా కోస్తుక్ (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మార్టా నుంచి స్వైటెక్‌కు గట్టి పోటీనే ఎదురైంది. ఆరంభంలో స్వైటెక్ సర్వీస్ బ్రేక్ చేసి మార్టా జోరు మీద కనిపించింది. కానీ ఒత్తిడిని తట్టుకుంటూ స్వైటెక్ తన శైలి ఫోర్‌హ్యాండ్ షాట్లతో ఎదురుదాడికి దిగింది. ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేయడమే కాక.. అదే జోరుతో సెట్ దక్కించుకుంది. రెండో సెట్లోనూ మార్టా పోరాడింది. కానీ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది మరోవైపు జోరు మరింత పెంచిన ఇగా.. వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 6-4తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది.
పురుషుల విభాగంలో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) సెమీస్‌లో అడుగుపెట్టాడు. క్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ 6-4,6-1,6-1తో డావిడోవిచ్ ఫొకినా (స్పెయిన్)పై విజయం సాధించాడు. గంటా 36 నిమిషాల్లో ముగిసిన ఏకపక్ష క్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్.. 24 విన్నర్లతో సత్తాచాటితే.. ఫొకినా 37 అనవసర తప్పిదాలతో పరాజయం వైపు నిలిచాడు. మరో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో సిట్సిపస్ 6-3,6-2,7-5తో కారెనో బుస్టా (స్పెయిన్)పై గెలుపొందాడు. ఈరోజు జరుగనున్న పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో స్వార్ట్‌మన్‌తో రఫెల్ నాదల్, బెరెట్టినితో నోవాక్ జొకోవిచ్ అమీతుమీ తేల్చుకోనున్నారు.