
పారిస్: క్రికెట్ మహాసముద్రంలో మునిగిపోయిన ప్రేక్షకులకు.. టెన్నిస్ పలకరించబోతోంది. ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ 2021 (French Open 2021) ఇంకో రెండు రోజుల్లో మన ముందుకు రానుంది. దీనికి సంబంధించిన మెయిన్ డ్రా వెలువడింది. ఫ్రాన్స్ కాలమానం ప్రకారం.. గురువారం ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ డ్రాను రోలండ్ గారోస్ ప్రకటించింది. ఎవరు, ఎవరితో తలపడబోతోన్నారనేది తేలిపోయింది. కొన్ని అనూహ్య పరిణామాలు, ఆసక్తికరమైన మార్పులు ఈ మెయిన్ డ్రాలో చోటు చేసుకున్నాయి.
ఈ డ్రా ప్రకారం చూసుకుంటే టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలుతోన్న ముగ్గురు బిగ్ స్టార్స్.. ఒకే గ్రూప్‌లో తలపడనున్నారు. రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్, నొవాక్ జొకొవిచ్.. ఒకే హాఫ్‌లో చేరారు. ఇప్పటిదాకా 13 సార్లు రఫెల్ నాదల్ ఛాంపియన్‌గా ఆవిర్భవించారు. 20 సార్లు గ్రాండ్ స్లామ్ విన్నర్‌గా రోజర్ ఫెదరర్ నిలిచారు. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్, సెర్బియాకు చెందిన జొకొవిచ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ముగ్గురూ టైటిల్ హాట్ ఫేవరెట్స్‌గా తమ వేటను మొదలు పెట్టనున్నారు.
ఏ మ్యాచ్‌లో కూడా ఇంటిముఖం పట్టకుండా ఆడగలిగితే- జొకొవిచ్, రోజర్ ఫెదరర్.. ఈ గ్రాండ్ స్లామ్‌లో క్వార్టర్ ఫైనల్‌లోనే ఢీ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ డ్రా ప్రకారం.. రఫెల్ నాదల్ కూడా ఫైనల్ మ్యాచ్ కంటే ముందే జొకొవిచ్‌ను ఢీ కొట్టడానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతం నాదల్‌ది మూడో ర్యాంక్. ఏటీపీ ప్రపంచ ర్యాంకింగ్ (ATP World ranking)లో టాప్ ప్లేస్ నుంచి మూడో స్థానానికి పడిపోయిన నాదల్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన అలెక్సీ పోపిరిన్‌ను ఢీ కొట్టాల్సి ఉంది.
అలాగే- ఫోర్త్ రౌండ్‌లో 18వ ర్యాంక్ ఆటగాడు, ఇటాలియన్ స్టార్ ప్లేయర్ జన్నిక్ సిన్నర్‌ను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మరో గ్రూప్‌లో డొమినిక్ థీమ్, సిక్స్ సీడ్, జర్మన్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ ఉన్నారు. డొమినిక్ థీమ్.. ఈ సారి కూడా స్టార్ ప్లేయర్లకు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్రెంచ్ ఓపెన్‌లో రెండుసార్లు ఆయన ఫైనలిస్ట్. రెండుసార్లు ఫైనల్ వరకూ చేరి.. ఛాంపియన్ కాలేకపోయాడు. రన్నరప్‌గా నిలిచాడు. ఈ సారి కూడా డొమినిక్ ఫైనల్‌పై కన్నేశాడు.