
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ 2021లో మహిళల సింగిల్స్ విభాగంలో టాప్-10 సీడెడ్ క్రీడాకారిణుల పరాజయపర్వం కొనసాగుతోంది. ఇప్పటికే టాప్-10లోని ఆరుగురు క్రీడాకారిణులు ఇంటిదారి పట్టగా.. వారి సరసన ఐదో సీడ్ ప్లేయర్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) చేరింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 33వ ర్యాంకర్ బర్బొరా క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6-3, 6-2తో స్వితోలినాను ఓడించింది. దీంతో వరుసగా రెండో ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి క్రిచికోవా ప్రవేశించింది. గంటా 39 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో క్రిచికోవా దూకుడు ముందు స్వితోలినా నిలువలేకపోయింది. ఒత్తిడి గురై బంతిని కోర్టుకు దూరంగా కొట్టడంతో పాటు డబుల్‌ఫాల్ట్స్ చేసింది. మరోవైపు స్వేచ్ఛగా ఆడిన క్రిచికోవా.. ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి సునాయాస విజయాన్ని అందుకుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ ఇగా స్వైటెక్ (పోలెండ్) కూడా ప్రిక్వార్టర్స్ చేరింది. ఎనిమిదో సీడ్ స్వైటెక్ 7-5 (7/4), 6-0తో కొంటావిట్ (ఇస్తోనియా)ను ఓడించింది. తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్న స్వైటెక్.. రెండో సెట్లో విజృంభించి ఆడింది. కొంటావిట్‌కు ఒక్క గేమ్ ఇవ్వకుండా సెట్‌తో పాటు మ్యాచ్‌ను సునాయాసంగా కైవసం చేసుకుంది. అమెరికా అమ్మాయిలు సోఫియా కెనిన్, స్లోన్ స్టీఫెన్స్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. కొస్తుక్ (ఉక్రెయిన్), జబెర్ (ట్యూనీసియా) కూడా మూడో రౌండ్ అధిగమించారు.
పద్నాలుగో ఫ్రెంచ్ టైటిల్‌పై గురిపెట్టిన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఆ దిశగా దూసుకెళుతున్నాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో మూడో సీడ్ నాదల్ 6-3, 6-3, 6-3తో కామెరూన్ నోరి (బ్రిటన్)ను ఓడించాడు. మొదటి సెట్ సునాయాసంగా గెలిచినా.. రెండో సెట్లో రఫాకు నోరి నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఒక దశలో నోరి 3-1తో ఆధిక్యంలో నిలిచాడు. కానీ వరుసగా అయిదు గేమ్‌లు సాధించిన రఫా.. 6-3తో సెట్‌ను చేజిక్కించుకున్నాడు. అదే జోరును మూడో సెట్లోనూ ప్రదర్శించిన నాదల్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. రొలాండ్ గారోస్‌లో నాదల్‌కు ఇది 103వ విజయం. ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అత్యధిక విజయాల ఘనత అతడిదే. ఈ టోర్నీలో ప్రిక్వార్టర్స్ చేరడం రఫాకు ఇది 16వ సారి.
టాప్‌సీడ్ నొవాక్ జకోవిచ్ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. మూడో రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్ జకోవిచ్ 6-1, 6-4, 6-2తో రికార్డాస్ బెర్కిన్స్ (లిథుయేనియా)పై సునాయాస విజయం అందుకున్నాడు. రొలాండ్ గారోస్‌లో ప్రిక్వార్టర్స్ దశకు చేరడం నొవాక్‌కు ఇది వరుసగా 12వ సారి. పదోసీడ్ ష్వార్జ్‌మాన్ (అర్జెంటీనా), సినర్ (ఇటలీ), స్ట్రాఫ్ (జర్మనీ), లోరెంజో ముసెటి (ఇటలీ) కూడా ప్రిక్వార్టర్స్ చేరారు. హోరాహోరీగా సాగిన మరో పోరులో ముసెటి 3-6, 6-4, 6-3, 3-6, 6-3తో తన దేశానికే చెందిన మార్కోను ఓడించాడు. సినర్ 6-1, 7-5, 6-3తో యెమెర్ (స్వీడన్)పై గెలిచాడు. సిట్సిపాస్ (గ్రీస్) కూడా ప్రిక్వార్టర్స్ చేరాడు.
గతేడాది ఫ్రెంచ్ ఓపెన్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందన్న అనుమానంతో అరెస్టు చేసిన రష్యా క్రీడాకారిణి యానా సిజికోవాను పోలీసులు విడుదల చేశారు. గురువారం అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రాథమికంగా విచారించిన తర్వాత ఆమెను వదిలేశారు. అయితే ఈ కేసు విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. తనను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపిస్తూ సిజికోవా పరువు నష్టం దావా వేయబోతున్నట్లు సమాచారం.