పారిస్: స్విట్జర్లాండ్ టెన్నిస్ వీరుడు రోజర్ ఫెదరర్ చరిత్ర సృష్టించాడు. నాలుగేళ్ళుగా ఊరిస్తున్న ఫ్రెంచ్ ఓపెన్ ను తొలిసారి సొంతం చేసుకున్నాడు. గతంలో నాదల్ చేతిలో పరాజయాల హ్యాట్రిక్ సాధించిన ఫెదరర్ గురి నాలుగోసారి తప్పలేదు. నాదల్ చిత్తయినప్పుడే సగం ఫ్రెంచ్ ఓపెన్ ను గెలిచిన రోజర్ ఫెదరర్ ఫైనల్లో సొదర్లింగ్ ను కంగుతినిపించి కల నెరవేర్చుకున్నాడు. 27 ఏళ్ళ ఫెదరర్ ఒక గంటా 55 నిమిషాల్లో మ్యాచ్ ను ముగించి సత్తా చాటాడు. మాజీ నంబర్ వన్ , ప్రస్తుత నంబర్ టూ ఫెదరర్ కు 23వ సీడ్ సొదర్లింగ్ ఏ సమయంలోనూ పోటీని ఇవ్వలేకపోయాడు. రొలాండ్ గారోస్ లో ఆదివారం జరిగిన ఫైనల్లో ఫెదరర్ 6-1, 7-6 (7/1), 6-4 స్కోరుతో వరుస సెట్లలో రాబిన్ సొదర్లింగ్ (స్వీడన్ )ను కంగుతినిపించాడు. జాన్ మెకన్రో, బోరిస్ బెకర్ , స్టెఫాన్ ఎడ్ బర్గ్ , పీట్ సంప్రాస్ వంటి హేమాహేమీలు విఫలమైన చోట టైటిల్ సాధించి సంప్రాస్ 14 గ్రాండ్ స్లామ్ టైటిళ్ళు రికార్డును సమం చేశాడు. అన్ని ప్రధాన టైటిళ్ళు (గ్రాండ్ స్లామ్ ) సాధించిన ఆరో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.