
సెరెనా ఈ ‘సారీ’
కెరీర్లో 24వ గ్రాండ్ స్లామ్ వేటలో ఉన్న సెరెనా విలియమ్స్(అమెరికా), డిఫెండింగ్ చాంపియన్ నవొమి ఒసాకా(జపాన్)కు చుక్కెదురైంది. మాజీ విజేతలు, కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్), పదో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. మార్గరెట్ కోర్ట్ (ఆ్రస్టేలియా) పేరిట ఉన్న 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ రికార్డును సమం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఎనిమిదో సీడ్ సెరెనా విలియమ్స్ ఆశలను చైనాకు చెందిన 28 ఏళ్ల కియాంగ్ వాంగ్ వమ్ము చేసింది.
2 గంటల 41 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో 19వ సీడ్ కియాంగ్ వాంగ్ 6-4, 6-7 (2/7), 7-5తో ఆరుసార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్ సెరెనాను బోల్తా కొట్టించింది. గతేడాది యూఎస్ ఓపెన్‌లో సెరెనాతో క్వార్టర్ ఫైనల్లో కేవలం ఒక్క గేమ్ మాత్రమే నెగ్గి ఘోరంగా ఓడిన కియాంగ్ వాంగ్ తాజా గెలుపుతో అమెరికా స్టార్‌పై ప్రతీకారం తీర్చుకుంది. అమెరికాకు చెందిన 15 ఏళ్ల టీనేజ్ సంచలనం కోరి గౌఫ్ మరో అద్భుతం చేసింది. మూడోరౌండ్లో 15 ఏళ్ల గాఫ్ 6-3, 6-4తో నవోమి ఒసాకా(జపాన్)ను చిత్తు చేసింది.

ఫెడరర్ చెమటోడ్చి..
తొలి రెండు రౌండ్లలో పోటీయే ఎదురుకాని మూడో సీడ్ ఫెడరర్‌కు మూడో రౌండ్లో చెమటోడ్చాడు. స్థానిక ప్లేయర్ జాన్ మిల్మన్పై 4-6, 7-6 (7/2), 6-4, 4-6, 7-6 (10/8)తో అతికష్టంపై నెగ్గాడు. ఫెడెక్స్కిది ఇక్కడ 100వ గెలుపు కావడం విశేషం. డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ 6-3, 6-2, 6-2తో నిషియోకా (జపాన్)పై గెలిచాడు.

సిట్సి‘పాస్’కాలేదు..
నిరుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్స్‌లో ఫెడరర్‌పై గెలిచిన గ్రీక్ ఆటగాడు స్టెఫానో సిట్సిపాస్ ఈసారి మూడోరౌండ్‌ను దాటలేదు. రౌనిక్ (కెనడా)7-5, 6-4, 7-6 (7/2)తో ఆరోసీడ్ సిట్సిపా్‌సను ఇంటికి పంపాడు.

దివిజ్ జోడీ ఓటమి
పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో దివిజ్ శరణ్- సిటాక్ (న్యూజిలాండ్) జంట 6-7, 3-6తో బ్రూనో సోర్స్-మేట్ పవిక్ జోడీ చేతిలో ఓడింది.