మొన్న 'మోసగత్తె' అని తిట్టింది, నేడు ఆమెనే ఓడించింది
హైదరాబాద్: 15 నెలల నిషేధం తర్వాత టెన్నిస్‌లోకి ఘనంగా పునరాగమనం చేసిన రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా మాడ్రిడ్ ఓపెన్‌లో ఓటమి పాలైంది. షరపోవా మోసగత్తె అని ఆమెకు జీవితకాల నిషేధమే సరైనదని వ్యాఖ్యానించిన కెనడా క్రీడాకారిణి యూజిని బౌచర్డ్ చేతిలో రెండో రౌండ్‌లో షరపోవా పోరాడి ఓడింది.
సుమారు మూడు గంటల పాటు హోరా హోరీగా సాగిన మ్యాచ్‌లో యూజిని బౌచర్డ్ చేతిలో 7-5, 2-6, 6-4 తేడాతో షరపోవా పోరాడి ఓడింది. మ్యాచ్ అనంతరం ఆమె మాట్లాడుతూ షరపోవాను ఎదుర్కొనేందుకు తాను అదనపు ప్రేరణతో ఆడానని బౌచర్డ్ తెలిపింది. బౌచర్డ్ తర్వాతి రౌండ్‌లో ప్రపంచ నెంబర్ 2 ఏంజెలిక్ కెర్బర్‌తో తలపడనుంది.
నిషేధిత ఉత్ప్రేరకం మెల్డోనియం తీసుకొన్నందుకు షరపోవాపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నిషేధం ముగిసిన తర్వాత షరపోవా వైల్డ్‌కార్డ్ ద్వారా స్టుగార్ట్ ఓపెన్‌లో ప్రవేశించింది. ఏడాదిన్నర నిషేధం తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లో ఆమె విజయం సాధించింది. రాబెర్టా విన్సీని 7-5, 6-3 తేడాతో చిత్తుగా ఓడించింది.

మ్యాచ్ అనంతరం ఆమెకు వీక్షకులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో ఘనమైన స్వాగతం పలికారు. అయితే షరపోవా పునరాగమనంపై కెనడా క్రీడాకారిణి యూజిని బౌచర్డ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. షరపోవా పునరాగమనం టెన్నిస్‌కు మంచిది కాదని, ఆమె మోసగత్తె అని ఆరోపించింది.
నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిన ఆమెను మళ్లీ ఆడేందుకు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించింది. 'ఇది సరికాదు. ఆమె ఒక మోసగత్తె. ఏ క్రీడలో అయిన మోసగాళ్లను మళ్లీ ఆడనివ్వకూడదు. ఇలా ఆడనివ్వడం ఇతర ఆటగాళ్లకు అన్యాయం చేయడమే. ప్రపంచ టెన్నిస్ సమాఖ్య ఈ విషయంలో తప్పుడు సంకేతాలు ఇస్తోంది' అని బౌచర్డ్ అభిప్రాయపడింది.

'మోసం చేసిన వాళ్లను కూడా తిరిగి ఘనంగా ఆహ్వానిస్తారనే తప్పుడు సంకేతాలు ఈ చర్చ వల్ల పిల్లలకు వెళ్లే అవకాశముంది. షరపోవాకు జీవితకాల నిషేధమే సరైన శిక్ష' అని బౌచర్డ్ అభిప్రాయపడింది. షరపోవా పునరాగమనంపై పలువురు టెన్నిస్ స్టార్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications