హైదరాబాద్: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. ఈ విషయాన్ని బుధవారం జొకోవిచ్ అధికారికంగా ప్రకటించాడు. ర్యాంకింగ్స్‌లో నాలుగో స్ధానంలో ఉన్న జొకోవిచ్కి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్లో మ్యాచ్ సందర్భంగా మోచేతికి గాయమైన సంగతి తెలిసిందే.
గాయం కారణంగా వింబుల్డన్ పోటీ నుంచి మధ్యలోనే తప్పుకొన్నాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వచ్చే నెలలో జరిగే యుఎస్ ఓపెన్‌తో పాటు ఈ ఏడాది మొత్తం ఆటకు దూరంగా ఉండనున్నట్టు జొకోవిచ్ చెప్పాడు. ఫేస్‌బుక్‌లో వీడియో ద్వారా జకోవిచ్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

తన కెరీర్ ప్రారంభం నుంచి తాను ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు, అయితే గత కొన్ని సంవత్సరాలుగా చాలా సహనంతో ఉన్నానని చివరకి ఈ సమస్యకి పరిష్కారం కనుగొన్నట్లు జొకోవిచ్ చెప్పాడు. వరల్డ్ మాజీ నెంబర్ వన్ అయిన నొవాక్ జొకోవిచ్ 12 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలిచిన సంగతి తెలిసిందే.