జొకోవిచ్ సంచలనం: ఏడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ సంచలనం సృష్టించాడు. గతంలో ఆరుసార్లు ఫైనల్‌కు చేరి ఆరుసార్లూ (2008, 2011, 2012, 2013, 2015, 2016) విజేతగా నిలిచిన జొకోవిచ్ ఏడోసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. ఆదివారం రాడ్ లేవర్ ఎరీనాలో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-3, 6-2, 6-3తో రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై విజయం సాధించాడు.
దీంతో రికార్డు స్థాయిలో ఏడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఫలితంగా దిగ్గజాలు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా)ల చెరో ఆరు టైటిళ్ల రికార్డును జొకోవిచ్ బద్దలు కొట్టాడు. జొకోవిచ్ కెరీర్‌లో ఇది 15వ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ కావడం విశేషం. ఈ క్రమంలో పీట్ సంప్రాస్ (14)ను అధిగమించి మూడో స్థానానికి ఎగబాకాడు. రోజర్ ఫెదరర్ (20 టైటిళ్లు), రఫెల్ నాదల్ (17) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
68 ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో జొకోవిచ్ మొత్తం 76 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 68 మ్యాచ్‌ల్లో గెలిచి, ఎనిమిదింటిలో మాత్రమే ఓడిపోయాడు. గతేడాది వింబుల్డన్, యుఎస్ ఓపెన్‌తో పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన జొకోవిచ్.. హ్యాట్రిక్ స్లామ్‌ను పూర్తి చేసుకున్నాడు. ఒకవేళ మే నెలలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ గెలిస్తే, ఓపెన్ శకంలో నాలుగు మేజర్ టైటిళ్లను రెండుసార్లు నెగ్గిన ఏకైక ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
అంతేకకాదు ఓపెన్ శకంలో జొకోవిచ్-నాదల్ తలపడినన్నిసార్లు ఇంకెవ్వరూ ఎదురుపడలేదు. వీరిద్దరి మధ్య ఇది 53వ మ్యాచ్. నాదల్‌తో 53 సార్లు తలపడిన జొకోవిచ్ 28 సార్లు గెలిచి, 25 సార్లు ఓడిపోయాడు. గతంలో 2012లో ఈ ఇద్దరి మధ్య జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్ టైటిల్ విజేతగా నిలిచాడు.

2 గంటల 4 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్
2012లో చివరిసారి వీరిద్దరి మధ్య జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ 5 గంటల 53 నిమిషాలు కొనసాగగా... ఈసారి మాత్రం 2 గంటల 4 నిమిషాల్లోనే ముగిసింది. ఒత్తిడితో మ్యాచ్‌ను మొదలు పెట్టిన నాదల్ ఏ దశలోనూ జొకోవిచ్‌కు పోటీ ఇచ్చేలేకపోయాడు. దీంతో ప్రతి పాయింట్‌ను తనదైన శైలిలో చేజిక్కించుకున్న జొకోవిచ్ వెనుదిరిగి చూడలేదు. బంతిపై పూర్తి నియంత్రణ చూపెడుతూ తొలి సెట్‌లో తొలి నాలుగు సర్వీస్‌లను ఒక్క పాయింట్ కూడా కోల్పోకుండా సొంతం చేసుకున్నాడు. తర్వాతి గేమ్‌లో నాదల్ ఫోర్‌హ్యాండ్లను సంధించినా దీటుగా ఎదుర్కొంటూనే 36 నిమిషాల్లోనే సెట్‌ను ముగించాడు.

రెండోసెట్‌లోనూ జొకోవిచ్ విజృంభణ
ఇదే తరహాలో సాగిన రెండోసెట్‌లోనూ జొకోవిచ్ విజృంభణ చేశాడు. వేగంగా దూసుకువచ్చిన జొకో సర్వీస్‌లను అడ్డుకునే సాహసం నాదల్ చేయలేకపోయాడు. దీంతో పాటు తన సర్వీస్‌ను సైతం కాపాడుకోలేకపోయాడు. సుదీర్ఘంగా సాగిన ఐదో గేమ్‌లో నాదల్ సంధించిన లోబ్ వ్యాలీని జొకోవిచ్ బ్యాక్‌హ్యాండ్ షాట్‌తో నిలువరించి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఏడో గేమ్‌లో మళ్లీ స్పెయిన్ ప్లేయర్ సర్వీస్‌ను అడ్డుకుని 5-2 ఆధిక్యంలోకి వెళ్లాడు.

వరుసగా మూడు ఏస్‌లు సంధించి
తన సర్వీస్ (8వ గేమ్)లో వరుసగా మూడు ఏస్‌లు సంధించి గంటా 16 నిమిషాల్లోనే రెండు సెట్ల ఆధిక్యంలో నిలిచాడు. ఈ రెండు సెట్లలో కలిపి జొకోవిచ్ 8 ఏస్‌లు సంధిస్తే, నాదల్ ఒక్కదానితో సరిపెట్టుకున్నాడు. జొకోవిచ్ నాలుగు అనవసర తప్పిదాలు చేయగా, నాదల్ 20సార్లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మూడోసెట్ మూడో గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 2-1 ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే నాలుగో గేమ్‌లో సర్వీస్ చేజార్చుకోవడంతో స్కోరు 2-2తో సమమైంది. ఐదు, తొమ్మిదో గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో పాటు ఆరు, ఎనిమిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకుని చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు.
మ్యాచ్ విజయం అనంతరం జొకోవిచ్
మ్యాచ్ విజయం అనంతరం జొకోవిచ్ మాట్లాడుతూ "నేను ఆడిన గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఇదే అత్యుత్తమం. ఇప్పటికీ మేం అతిపెద్ద టైటిల్స్ కోసం పోటీపడుతున్నామంటే నమ్మలేకపోతున్నా. ఈ సాయంత్రం అద్భుతంగా గడిచింది. నాదల్‌పై నేను కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శన కూడా ఇదే. ఏడాది క్రితం మోచేతికి శస్త్ర చికిత్స జరిగింది. ఆటతో పాటు ర్యాంకింగ్స్ చేజారింది. అయినా నిరాశ చెందకుండా మళ్లీ మీ ముందు ఇలా నిలబడటం అమోఘంగా అనిపిస్తున్నది. మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించి గతేడాది వరుసగా వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గెలిచి ఫామ్‌లోకి వచ్చాను. ఇది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడంతో నా అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నాను. నేను ఏదైతే అనుకున్నానో దానిని సమర్థంగా అమలు చేశా. నాదల్‌కు పుంజుకునే అవకాశం ఇస్తే మ్యాచ్‌ను ఎక్కడికో తీసుకెళ్తాడు. అందుకే ఆ అవకాశం ఇవ్వకుండా నా పని పూర్తి చేశా" అని వ్యాఖ్యానించాడు.
జొకోను ఓడించాలంటే ఈ ఆట సరిపోదు
నాదల్ మాట్లాడుతూ "జొకోను ఓడించాలంటే ఈ ఆట సరిపోదు. గాయం కారణంగా ఐదు నెలలుగా ఆటకు దూరంగా ఉన్నా. కాబట్టి ఈ టోర్నీలో ఆడటం నాకు ఓ పెద్ద సవాలుగా నిలిచింది. 100 శాతం ఫిట్‌నెస్ లేకుండా అతన్ని ఓడించడం చాలా కష్టం. గతేడాది చాలా కష్టంగా గడిచింది. యూఎస్ ఓపెన్ తర్వాత కేవలం తొమ్మిది టోర్నీల్లోనే ఆడా. గాయం నుంచి పూర్తిగా కోలుకోకుండానే ఈ రెండు వారాలు మెరుగైన టెన్నిస్ ఆడాననే అనుకుంటున్నా. మరింత మ్యాచ్ ప్రాక్టీస్ కావాలి. ఇలాంటి టోర్నీల్లో మరింత మెరుగ్గా రాణించాలి. వయసును దృష్టిలో పెట్టుకుని టోర్నీలను ఎంపిక చేసుకోవాలి. నా క్యాలెండర్, నా ప్రాధమ్యాలు నాకు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇంటికెళ్లి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి. ఆ తర్వాత నా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తా" అని చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్‌మనీ వివరాలివే
ప్రైజ్‌మనీ విజేత జొకోవిచ్ -రూ. 20.88 కోట్లు
రన్నరప్ నాదల్ -రూ. 10.44 కోట్లు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications