న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి తానేమీ డబ్బులు అడగలేదని హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పష్టం చేశారు. ఆ కార్యక్రమానికి హాజరు కావడానికి సానియా గొంతెమ్మ కోరికలు కోరారంటూ బుధవారం వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై సానియా వ్యవహారాలను చూసే ఏజెన్సీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆ ప్రకటనను సానియా ట్విట్టర్‌లో కూడా పోస్టు చేశారు. కార్యక్రమానికి హాజరు కావడానికి తాను డబ్బులు అడగలేదని అంటూ తనకు ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేయాలని అడిగానని, అదే రోజు తాను గోవాలో మరో కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండిందని, అందువల్ల ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేయాలని తాను అడగడంలో తప్పేమీ లేదని ఆమె అన్నారు.
సానియా వ్యవహారాలు చూస్తున్న అధికారిక ఏజెన్సీ ప్రకటన సారాంశం ఇలా ఉంది - నవంబర్ 28వ తేదీన భోపాల్‌లో ఏర్పాటైన కార్యక్రమానికి హాజరు కావడానికి సానియా సిద్ధంగా ఉన్నారు. దానిపై చర్చలు జరిగాయి. ఐదు లక్షల రూపాయలను సానియా డిమాండ్ చేయలేదు.

గోవాలో 29వ తేదీన జరిగే కార్యక్రమానికి సానియా అంగీకరించారు. కమర్షియల్ ఫ్లయిట్‌లో భోపాల్ నుంచి గోవాకు వెళ్లడానికి ఏడు గంటల సమయం పడుతుంది. భోపాల్ నుంచి గోవాకు ప్రైవేట్ ఫ్లయిట్ ఏర్పాటు చేస్తే తప్ప రెండు చోట్ల ఉండడం ఆమెకు సాధ్యం కాదు. అందుకే ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేయాలని కోరారు. గోవా కార్యక్రమం నెల రోజులకు ముందే ఖరారైంది. అందువల్ల ఆ కార్యక్రమానికి సానియా వెళ్లడం బాధ్యతగా భావించారు.
సానియాపై కొన్ని వర్గాలు చేసిన అవాంఛనీయమైన, నష్టం కలిగించే వ్యాఖ్యలకు తాము తీవ్రంగా ఆవేదన చెందామని ఏజెన్సీ తెలిపింది.