భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, స్పెయిన్ టాప్ షట్లర్ కరోలినా మారిన్ మాటల యుద్ధానికి దిగారు. మ్యాచ్ మధ్యలోనే ఆట మానేసి నోటికి పని చెప్పారు. ఒక్కసారి కాదు.. మ్యాచ్ మధ్యలో అనేక సార్లు ఇద్దరూ ఇలా మాటల యుద్ధానికి దిగారు. దీంతో అంపైర్ కలుగజేసుకుని ఇద్దరికీ పెనాల్టీ విధించారు.
డెన్మార్క్ ఓపెన్ 2023లో సెమీఫైనల్లో పీవీ సింధు, కరోలినా మారిన్ మధ్య శనివారం తలపడ్డారు. మ్యాచ్ సందర్భంగా ఇద్దరి మధ్య అనేకసార్లు వాగ్వాదం జరిగింది. పాయింట్ సాధించిన ప్రతిసారి ఒకరినొకరు ఏదో ఒకటి అంటూ పరస్పరం నిందించుకున్నారు. ఒకానొక టైంలో ఇద్దరి అరుపులు, కేకలతో వాగ్వాదం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే సింధు, మారిన్‌లను చైర్ అంపైర్ అనేక సార్లు హెచ్చరించారు. అయినా ఇద్దరూ ఎక్కడా తగ్గలేదు.

దానికి తోడు మూడో గేమ్‌లో సింధు త్వరగా సర్వ్ చేయకపోవడంపై కూడా అంపైర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై అంపైర్ సింధును ప్రశ్నించగా...'ఆమె అరిచేందుకు అవకాశమిచ్చారు కదా. ముందు ఆమెను ఆపమని చెబితే నేనూ సిద్ధంగా ఉంటా' అని సింధు బదులిచ్చింది. మరొకరి కోర్టునుంచి షటిల్ తీసుకోవద్దని ఇద్దరికీ చెప్పాల్సి వచ్చింది. చివరకు అంపైర్ ఇద్దరికీ 'ఎల్లో కార్డు'లు కూడా చూపించాల్సి వచ్చింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రెండు గేమ్‌లలో ఇద్దరూ పోటాపోటీగా ఆడి చెరో గేమ్‌ను సొంతం చేసుకున్నా.. మూడో గేమ్‌లో కరోలినా విజృంభించింది. సింధును సునాయాసంగా ఓడించింది. దీంతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుని సెమీస్ విజేతగా నిలిచింది. 73 నిముషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 18-21, 21-19, 7-21 పాయింట్లతో సింధు ఓటమిపాలైంది.
ఇదిలా ఉంటే కరోలినా చేతిలో సింధుకు ఇది 11వ ఓటమి. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఇద్దరి మధ్య రికార్డ్ 5-10 గా ఉన్న హెడ్ టూ హెట్ రికార్డ్.. ఈ మ్యాచ్ తర్వాత 5-11 కు చేరింది.