
హైదరాబాద్: హోరాహోరీగా పోడాల్సిన డేవిస్ కప్‌లో సెర్బియాతో డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ పోరులో భారత్ కథ ముగిసింది. తొలి రోజు రెండు సింగిల్స్‌లోనూ ఓడిన భారత్.. రెండో రోజు డబుల్స్‌లోనూ పరాజయం పాలైంది. శనివారం చావోరేవో పోరులో రోహన్ బోపన్న-సాకేత్ మైనేని జోడీ 6-7 (5-7), 2-6, 6-7 (4-7)తో నికోలా మిలోజవిచ్-డానిలో పెట్రోవిచ్ జంట చేతిలో పోరాడి ఓడింది. బోపన్న-సాకేత్ జోడీతో పోలిస్తే ప్రత్యర్థి జంటకు అనుభవం తక్కువే.
ఈ మ్యాచ్ గెలిచి భారత్ పోటీలో నిలుస్తుందని అభిమానులు ఆశించారు. కానీ కీలక సమయాల్లో ఒత్తిడికి గురైన భారత ద్వయం మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో బోపన్నకు జోడీగా బాలాజీ బరిలోకి దిగాల్సి ఉండగా.. మ్యాచ్ సమయానికి సాకేత్ అవకాశం దక్కించుకున్నాడు. ఆదివారం నామమాత్రమైన రివర్స్ సింగిల్స్ జరుగుతాయి.
ఈ మ్యాచ్ ఓడినప్పటికీ భారత్ ఫైనల్స్‌కు అర్హత సాధించేందుకు దారులు మూసుకుపోలేదు. మారిన ఫార్మాట్ ప్రకారం ఫిబ్రవరిలో 24 జట్లు పోటీ పడే అర్హత టోర్నీలో సత్తా చాటితే భారత్ ముందంజ వేసే అవకాశముంటుంది. స్పెయిన్‌ను ఓడించి ఫైనల్స్‌కు ఫ్రాన్స్: డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ డేవిస్ కప్‌లో ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
స్పెయిన్‌తో ప్రపంచ గ్రూప్ పోరులో ఫ్రాన్స్ 3-0తో విజయం సాధించి ముందంజ వేసింది. తొలి రెండు సింగిల్స్ నెగ్గిన ఫ్రాన్స్.. శనివారం డబుల్స్‌లోనూ గెలిచింది. డబుల్స్‌లో మహుత్-జులియన్ జోడీ 6-0, 6-4, 7-6 (9-7)తో లోపెజ్-గ్రానోలర్స్ జంటను ఓడించింది.