డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్-1లో స్వీడన్ చేతిలో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 0-4తో ఓటమిపాలైంది. డేవిస్ కప్‌లో స్వీడన్ చేతిలో ఇండియాకు ఇది వరుసగా ఆరో ఓటమి. ఇప్పటివరకు ఒక్కసారి కూడా స్వీడన్‌పై మనోళ్లు విజయం సాధించలేదు. శనివారం జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత టెన్నిస్ జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే.
శ్రీరామ్ బాలాజి, రామ్‌కుమార్ రామనాథన్‌లు పరాజయాన్ని చవిచూశారు. దీంతో ఆదివారం డబుల్స్, రివర్స్ సింగిల్స్ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ తప్పక నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ మన క్రీడాకారులు సత్తాచాటలేకపోయారు. ముందుగా జరిగిన డబుల్స్‌లో ఓటమిపాలై స్వీడన్‌కు విజయాన్ని ఖరారు చేశారు. ఇక నామమాత్రపు రివర్స్ సింగిల్స్‌లోనూ ఓడి 0-4తో నిలిచారు. దీంతో నిరూపయోగంగా చివరి రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ను నిర్వహించలేదు.

డబుల్స్ మ్యాచ్‌లో ఆండ్రీ గొరాన్సన్- ఫిలిప్ బెర్గెవి జోడీ చేతిలో శ్రీరామ్ బాలాజీ-రామ్‌కుమార్ రామనాథన్ జంట 3-6, 4-6 తేడాతో ఓటమిపాలైంది. తొలి సెట్‌లో ఓ దశలో 2-2తో బాలాజీ-రామ్ జోడీ గట్టిపోటీనే ఇచ్చింది. రెండో సెట్‌లోనూ 3-3తో హోరాహోరీగా పోటీ పడింది. కానీ అదే జోరును పూర్తిగా కొనసాగించలేకపోయారు.
నామమాత్ర రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లోనూ భారత్‌కు ఊరట దక్కలేదు. డేవిస్ కప్‌లో తొలిసారి భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జాతీయ మాజీ ఛాంపియన్ సిద్ధార్థ్... 2-6, 2-6తో ఎలియాస్ చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. భారత్‌పై ఘన విజయం సాధించిన స్వీడన్ వరల్డ్ గ్రూప్ క్వాలిఫయిర్స్‌కు అర్హత సాధించింది. మరోవైపు భారత్ వచ్చే ఏడాది డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్-1లో చోటు సంపాదించడం కోసం ప్లేఆఫ్ దశ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సారి టాప్ ప్లేయర్లు సుమిత్ నగాల్, యూకీ బాంబ్రీ లేకపోవడం భారత్‌కు ప్రతికూలంగా మారింది.