లండన్: ఏటీపీ ఫైనల్స్ 2020 టోర్నీని ప్రపంచ నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) సొంతం చేసుకున్నాడు. ఆదివారం లండన్‌లో జరిగిన తుది పోరులో 4-6, 7-6, 6-4 తేడాతో డొమినిక్ థీమ్‌ను మెద్వెదెవ్ ఓడించాడు. దీంతో కెరీర్లో తొలిసారి మెద్వెదెవ్ ఏటీపీ ఫైనల్స్ కప్పును అందుకున్నాడు. నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో మెద్వెదెవ్ తొలి సెట్లో వెనుకంజలో పడ్డాడు. అయితే తర్వాతి రెండు సెట్లలో పుంజుకోవడంతో యుఎస్ ఓపెన్ ఛాంపియన్ డొమినిక్ థీమ్‌కు షాక్ తగిలింది.
సెమీస్‌లో ప్రపంచ నంబర్ 2 ఆటగాడు రఫెల్ నాదల్‌ను ఓడించిన డానిల్ మెద్వెదెవ్.. తుదిపోరులో డొమినిక్ థీమ్‌ను ఓడించాడు. అంతకుముందు ఐదుసార్లు ఛాంపియన్ నోవాక్ జొకోవిచ్ కూడా మెద్వెదెవ్ చేతిలో ఓడిపోయాడు. ఈ విజయంతో మెద్వెదెవ్ ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో టాప్ మూడు ర్యాంకుల ఆటగాళ్లను ఓడించిన నాలుగో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతకు ముందు డేవిడ్ నాల్బాండియన్ (2007 మ్యాడ్రిడ్), నోవాక్ జకోవిచ్ (2007 మాంట్రియల్), బోరిస్ బెకర్ (1994 స్టాక్‌హోమ్) ఈ ఘనత సాధించారు.
మ్యాచ్ అనంతరం డానిల్ మెద్వెదెవ్ మాట్లాడుతూ... 'ఈ విజయం సాధించడం గొప్ప అనుభూతి. చాలా చాలా సంతోషంగా ఉంది. మాటల్లో చెప్పలేను. గ్రూప్ స్టేజ్‌లో నోవాక్ జకోవిచ్‌ను, సెమీస్‌లో రఫెల్ నాదల్‌ను, ఇప్పుడు డొమినిక్ థీమ్‌ను ఓడించడం ఆనందంగా ఉంది. వీళ్లంతా టెన్నిస్ ప్రపంచంలో టాప్ ఆటగాళ్లు. నేనేంటో ఈ గెలుపుతో నిరూపించుకున్నా. భవిష్యత్తులో మరిన్ని టైటిల్ సాధిస్తా' అని పేర్కొన్నాడు.
సెమీ ఫైనల్లో మెద్వెదెవ్ 3-6, 7-6 (7/4), 6-3తో రెండో ర్యాంకర్ నాదల్‌పై విజయం సాధించాడు. తొలి సెట్ చేజిక్కించుకొని.. రెండో సెట్లో ఓ దశలో 5-4తో ముందంజలో నిలిచిన నాదల్ అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు. గతేడాది ఏటీపీ ఫైనల్స్ రౌండ్ రాబిన్లో మూడింటిలోనూ ఓడి నిష్క్రమించిన మెద్వెదెవ్.. ఏడాది తిరిగే సరికి ఏకంగా టైటిల్ గెలవడం విశేషం. ఈ ఏడాది యూఎస్ ఓపెన్ సెమీస్‌లో మెద్వెదెవ్‌ను థీమ్ ఓడించిన సంగతి తెలిసిందే.
కోహ్లీసేన కవ్వించినా.. కూల్‌గానే ఉంటా!! బ్యాట్‌తోనే సమాధానం చెబుతా!