హైదరాబాద్: తెలంగాణ బ్రాడ్ అంబాసిడర్‌గా నియమితులైన కొద్ది రోజుల పాటు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా హడావిడి చేశారు. విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆమెను బ్రాడ్ అంబాసిడర్‌ను చేశారు. టెన్నిస్ క్రీడలో విజయాలు సాధించినప్పుడు నగదు బహుమతులు కూడా ఇచ్చారు.
అయితే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమానికి ఆమె డుమ్మా కొట్టడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెతుతున్నాయి. ఎక్కడమ్మా సానియా అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. సినీ తారలు పోటీ పడి హరిత హారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటితే సానియా మాత్రం కనిపించలేదు.

సోషల్ మీడియాలో సెటైర్లు కూడా విసురుతున్నారు. ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటాలని గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, సినీనటులు పిలుపునిస్తుండగా సానియా మీర్జా చూపే బంగారమైంది. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ పేరిట కోటి రూపాయలు తీసుకున్న సానియా కనీసం ఒక్క మొక్కైనా నాటడానికైనా రాకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు
ఆమెతో కోటి మొక్కలు నాటించాలని, ఆమెతో కోటి తట్టల మట్టి మోయించాలని ఇలా రకరకాలుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వేస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారిస్తున్న సానియా మీర్జా ఈ హరిత హారంలో పాల్గొని ప్రజలకు ఆదర్శంగా నిలిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, ఇటీవల బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్‌తో ఆమె తన ఆత్మకథను ఆవిష్కరింపజేసుకుని మాత్రం సందడి చేసింది.