న్యూయార్క్: యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా రెండో రౌండ్ లోకి ప్రవేశించింది. తొలి రౌండ్ లో ఆమె బెలారస్ కు చెందిన ఓల్గా గోవర్త్పోవాను 6-2, 3-6, 6-3 స్కోరుతో ఓడించింది. ఇద్దరు హిట్టర్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. తన ట్రేడ్ మార్క్ ఫోర్ హ్యాండ్ షాట్లతో సానియా తొలి సెట్ లో సునాయసంగానే విజయం సాధించింది. రెండో సెట్ ను కోల్పోవడంతో స్కోరు సమానమైంది. థర్డ్ సెట్ లో సానియా తన సత్తా చాటి విజయాన్ని అందుకుంది. మూడో రౌండ్ లోకి చేరుకోవాలంటే సానియా మీర్జా పదో సీడ్ ఇటాలియన్ క్రీడాకారిణి ఫ్లావ్యా పెన్నెట్టాపై విజయం సాధించాల్సి ఉంటుంది.