
స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) తొలి రౌండ్లోనే
ఫ్రెంచ్ ఓపెన్లో మరో షాక్. గతేడాది రన్నరప్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. మ్యాచ్ ఆసాంతం ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బందిపడిన వావ్రింకా పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 2-6, 6-3, 6-4, 6-7 (5-7), 3-6తో గర్సియా లోపెజ్ (స్పెయిన్)పై పోరాడి ఓడాడు. తొలి సెట్లో ఓడినా.. ఆ తర్వాత రెండు సెట్లు గెలిచి జోరందుకున్న వావ్రింకా.. నాలుగో సెట్‌ను టైబ్రేకర్‌లో చేజార్చుకున్నాడు. ఐదో సెట్లో ప్రత్యర్థికి రెండుసార్లు సర్వీసు అప్పగించిన అతను.. ఆపై సెట్‌తో పాటు మ్యాచ్‌ను కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో 4 డబుల్‌ఫాల్ట్స్ చేసిన వావ్రింకా 72 అనవసర తప్పిదాలతో ఓటమి కొనితెచ్చుకున్నాడు.

విక్టోరియా అజరెంక తొలి రౌండ్లోనే
మహిళల సింగిల్స్‌లో బెలారస్ భామ విక్టోరియా అజరెంక తొలి రౌండ్లోనే ఓడిపోయింది. సినియకోవా (చెక్ రిపబ్లిక్) 7-5, 7-5తో అజరెంకపై గెలిచింది. ఈ మ్యాచ్‌లో అజరెంక రెండు డబుల్‌ఫాల్ట్స్‌తో పాటు 38 అనవసర తప్పిదాలు చేసింది. అంతేకాక ఐదుసార్లు సర్వీసు కోల్పోయింది.

వోజ్నియాకి , ఎనిమిదోసీడ్ క్విటోవా ముందంజ
మరోవైపు రెండోసీడ్ వోజ్నియాకి (డెన్మార్క్), ఎనిమిదోసీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) ముందంజ వేశారు. సెపెడ్ రేగ్ (పరాగ్వే) నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్న క్విటోవా 3-6, 6-1, 7-5తో చెమటోడ్చి గెలిచింది. మరోవైపు వోజ్నియాకి 7-6 (7-2), 6-1తో కొలిన్స్ (అమెరికా)పై విజయం సాధించింది. కీస్ (అమెరికా), వాండ్‌వె (అమెరికా), మకరోవా (రష్యా) తొలి రౌండ్లో గెలిచారు.

మాజీ ఛాంపియన్ జకోవిచ్ శుభారంభం
మాజీ ఛాంపియన్ జకోవిచ్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో అతను 6-3, 6-4, 6-4తో దుత్రా సిల్వ (బ్రెజిల్)ను ఓడించాడు. మ్యాచ్ మొత్తంలో ఆరు ఏస్‌లు, 37 విన్నర్లు కొట్టిన నొవాక్.. ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీసు బ్రేక్ చేశాడు. ఏడో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) పెద్దగా కష్టపడకుండానే రెండోరౌండ్ చేరాడు. అతను 6-2, 6-4, 6-1తో ఇవాష్కా (బెలారస్)ను చిత్తు చేశాడు. డేవిడ్ ఫెర్రర్ (స్పెయిన్) తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. అతను 6-3, 6-3, 6-7 (3-7), 6-7 (4-7), 5-7తో మునార (స్పెయిన్) చేతిలో పరాజయం చవిచూశాడు. జ్వెరెవ్ (జర్మనీ) ముందంజ వేశాడు.


Click it and Unblock the Notifications












