హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరిస్‌లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది వరుసగా రెండో సూపర్ సిరీస్ ఫైనల్ చేరుకున్నాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో నాలుగో సీడ్ షై యుకి(చైనా)పై కిదాంబి శ్రీకాంత్ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు.
సెమీస్‌లో శ్రీకాంత్ తన ప్రత్యర్ధి షై యుకిపై అలవోక విజయం సాధించాడు. 37 నిమిషాలు పాటు సాగిన ఈ పోరులో రెండు వరుస గేమ్‌లను 21-10, 21-14తో గెలుచుకున్న శ్రీకాంత్ మ్యాచ్‌ని కైవసం చేసుకుని ఫైనల్‌కి దూసుకెళ్లాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌కి ముందు శ్రీకాంత్ ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
బ్యాడ్మింటన్‌లో భారత ఆటగాళ్ల హావా కొనసాగుతోంది. సింగపూర్ ఓపెన్ సూపర్ సిరిస్, ఇండోనేసియా, ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్‌ల్లో వరుసగా భారత ఆటగాళ్లు పైనల్‌కు చేరుకున్నారు. సింగపూర్ ఓపెన్ సిరిస్‌ను సాయి ప్రణీత్ గెలవగా, ఇండోనేషియా ఓపెన్‌ను శ్రీకాంత్ గెలిచాడు.
ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కిదాంబి శ్రీకాంత్ పైనల్‌కు చేరాడు. ఫైనల్లో కూడా శ్రీకాంత్ అదే ఫామ్‌ని కొనసాగిస్తే టైటిల్ గెలవడం ఖాయం అంటున్నారు అభిమానులు.
నిజానికి ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో ఒకేసారి నలుగురు భారత షట్లర్లు క్వార్టర్ ఫైనల్ చేరినప్పటికీ, ఆ నలుగురిలో ముగ్గురు షట్లర్లు సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవడంలో విఫలమయ్యారు. ఒలింపిక్ పతక విజేతలు సైనా నెహ్వాల్, పీవీ సింధు, సాయి ప్రణీత్‌లు టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.