మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్‌లో మంగళవారం సంచలనం నమోదైంది. మాజీ ఛాంపియన్, ప్రపంచ ఐదో ర్యాంకర్ రఫెల్ నాదల్ తొలిరౌండ్లోనే వెనుదిరిగాడు. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో స్పెయిన్ బుల్ నాదల్‌కు స్వదేశానికి చెందిన 45వ ర్యాంకర్ ఫెర్నాండో వెర్డాస్కో షాకిచ్చాడు.
ఫెర్నాండో 7-6(6), 4-6, 3-6, 7-6(4), 6-2 స్కోరుతో నాదల్‌పై పోరాడి గెలిచాడు. తొలిసెట్ ను కోల్పోయిన నాదల్ వెంటనే పుంజుకుని వరుసగా రెండు సెట్లను గెల్చుకున్నాడు. అయితే ఆ తర్వాత ఫెర్నాండో వరసగా రెండు సెట్లను గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
ఈ టోర్నీలో నాదల్ పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పుకోవాలి. 2013లో జరిగిన వింబుల్డన్ టోర్నీలో కూడా తొలి రౌండ్లోనే నాదల్ నిష్క్రమించాడు. 2014 ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత నాదల్ ఒక్క మేజర్ టైటిల్ కూడా గెలుచుకోకపోవడం గమనార్హం.

తాజా ఓటమి అనంతరం నాదల్ మాట్లాడుతూ.. మ్యాచ్ చాలా కఠినంగా సాగిందని, గెలుపు కోసం తన ప్రయత్నం తాను చేసినట్లు చెప్పాడు. 'ఇది నా రోజు కాదు' అని తెలిపాడు. ప్రాక్టీస్‌కు మించిన మంచి సాధనం లేదని, తాను గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటానని చెప్పాడు. లుగైదు నెలల నుంచి తాను తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపాడు.
2009లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ను రోజర్ ఫెదరర్‌ను ఓడించి నాదల్ అందుకున్నాడు. ఆ తర్వాత ఈ టోర్నీని దక్కించుకోలేకపోయాడు. కాగా, నాదల్‌ను ఓడించి విజయం సాధించడం తనకు చాలా ఆనందంగా ఉందని వెర్డస్కో తెలిపాడు. ఇతడు రెండో రౌండ్లో ఇజ్రాయెల్ ఆటగాడు దుడి సెలాతో తలపడనున్నాడు.