
హైదరాబాద్: మెల్ బోర్న్ వేదికగా సోమవారం ప్రారంభమైన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో భారత టెన్నిస్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌కు తొలి రౌండ్‌లోనే నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో భాగంగా జరిగిన తొలి రౌండ్‌లో 39వ ర్యాంకర్ టియాఫో(అమెరికా) చేతిలో 7-6(9/7), 6-3, 6-3 తేడాతో ప్రజ్నేశ్ ఓడిపోయాడు.
క్వాలిఫయింగ్ పోటీ ద్వారా ఆస్ట్రేలియా ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత పొందిన భారత ఆటగాడిగా ప్రజ్నేశ్ గుణేశ్వరన్ నిలిచాడు. అయితే, తాను తొలిసారి పాల్గొన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయి ఇంటిదారి పట్టాడు. తొలి సెట్‌లో ప్రజ్నేశ్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కడవరకూ పోరాడటంలో విఫలం చెందడంతో ఓటమి తప్పలేదు.
ఇరువురి మధ్య జరిగిన తొలి సెట్ టైబ్రేక్‌కు దారి తీయగా అందులో టియాఫో పోరాడి గెలిచాడు. ఆపై వరుస రెండు సెట్లలో ప్రజ్నేశ్ ప‍్రతిఘటించలేకపోయాడు. టియాఫో 88 శాతం నెట్ పాయింట్లు గెలవగా, ప్రజ్నేశ్ 67 శాతం నెట్ పాయింట్లు మాత్రమే గెలవగలిగాడు. ఈ పోరులో ప్రజ్నేశ్ అనవసర తప్పిదాలకు పాల్పడ్డాడు.
తొలి రౌండ్‌లో ప్రజ్నేశ్‌పై విజయం సాధించిన టియాఫో రెండో రౌండ్‌లో ఐదో సీడ్ కెవిన్ అండర్సన్(దక్షిణాఫ్రికా)తో తలపడనున్నాడు.