Australian Open 2026: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026లో ఆతిథ్య దేశానికి చెందిన జోడీ సరికొత్త చరిత్ర సృష్టించింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో వరుసగా రెండో ఏడాది టైటిల్ గెలుచుకుని, దశాబ్దాల కాలం నాటి రికార్డులను తిరగరాసింది. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026లో ఒలివియా గాడెకీ - జాన్ పీర్స్ జోడీ అద్భుతం చేసింది. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో ఈ ఆస్ట్రేలియా జోడీ ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టినా మ్లాడెనోవిక్ - మాన్యుయెల్ గినార్డ్ జోడీపై అద్భుత విజయం సాధించి విజేతలుగా నిలిచారు.
దశాబ్ధాలు రికార్డులు గల్లంతు
ఈ విజయంతో గాడెకీ - పీర్స్ జోడీ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో ఒక మిక్స్‌డ్ డబుల్స్ జోడీ వరుసగా రెండుసార్లు టైటిల్ నెగ్గడం 37 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా 1989లో యానా నోవోత్నా - జిమ్ పుగ్ జంట ఈ ఘనత సాధించింది. ఒక ఆస్ట్రేలియా జంట వరుసగా రెండుసార్లు తమ సొంత గడ్డపై టైటిల్ నిలబెట్టుకోవడం 62 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 1964లో మార్గరెట్ కోర్ట్ - కెన్ ఫ్లెచర్ జోడీ చివరిసారిగా ఈ ఫీట్ సాధించింది.

ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్
రోడ్ లేవర్ ఎరీనాలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఫ్రాన్స్ జోడీ ఆది నుంచే దూకుడు ప్రదర్శించి 6-4తో తొలి సెట్‌ను కైవసం చేసుకుంది. గట్టి పోటీ ఎదురైనప్పటికీ, హోమ్ క్రౌడ్ మద్దతుతో ఆస్ట్రేలియా జోడీ పుంజుకుని 6-3తో రెండో సెట్‌ను గెలిచి మ్యాచ్‌ను టైబ్రేకర్ వరకు తీసుకెళ్లింది. 10 పాయింట్ల టైబ్రేకర్‌లో ఒక దశలో గాడెకీ - పీర్స్ 5-7తో వెనుకబడ్డారు. కానీ ఒత్తిడిని అధిగమించి వరుస పాయింట్లతో 10-8తో విజయాన్ని అందుకున్నారు. రెండో ఛాంపియన్‌షిప్ పాయింట్ సాధించగానే స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. ఆస్ట్రేలియా టెన్నిస్ చరిత్రలో ఈ జోడీ పేరు శాశ్వతంగా నిలిచిపోనుంది.