ఆ్రస్టేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను టేలర్ టౌన్సెండ్ (అమెరికా), కేతరినా సినియాకోవా (చెక్) ద్వయం గెలుచుకుంది. తుది పోరులో ఈ జోడీ 6-2, 6-7 (4), 6-3 తేడాతో సీ సు వీ (చైనీస్ తైపీ), ఒస్తాపెంకో (లాత్వియా) జంటపై విజయం సాధించింది. మ్యాచ్‌లో టౌన్సెండ్, సినియాకోవా జోడీ 4 ఏస్‌లు, 32 విన్నర్లు కొట్టింది.
ఈ విజయంతో టౌన్సెండ్-సినియాకోవాకు 8,10,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 4 కోట్ల 41 లక్షలు)... సు వీ, ఒస్తాపెంకోకు 4,40,000 డాలర్లు (రూ. 2 కోట్ల 39 లక్షలు) నగదు బహుమతి దక్కింది.

సినియాకోవాకు కెరీర్‌లో ఇది 10వ గ్రాండ్‌స్లామ్ మహిళల డబుల్స్ టైటిల్. గతంలో ఆమె బార్బోరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్)తో కలిసి 2022, 2023లో ఆ్రస్టేలియన్ ఓపెన్.. 2018, 2021, 2024లో ఫ్రెంచ్ ఓపెన్... 2018, 2022, 2024లో వింబుల్డన్ టోర్నీ.. 2022లో యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను గెలిచింది.
తొలి ప్లేయర్ గా బెర్నెట్ ఘనత
ఆ్రస్టేలియన్ ఓపెన్ జూనియర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బాలుర సింగిల్స్ టైటిల్ ను హెన్రీ బెర్నెట్ సాధించాడు. తద్వారా ఈ టైటిల్ నెగ్గిన తొలి స్విట్జర్లాండ్ ప్లేయర్‌గా హెన్రీ బెర్నెట్ గుర్తింపు సాధించాడు. ఈ సింగిల్స్ ఫైనల్ లో బెర్నెట్ 6-3, 6-4తో బెంజమిన్ విల్‌వెర్త్ (అమెరికా)ను ఓడించాడు.