
మెల్‌బోర్న్: లేటు వయసులో కూడా కుర్రాళ్లతో పోటీపడుతూ గ్రాండ్‌స్లామ్స్ వేటలో దూసుకెళుతున్న స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ త్రుటిలో ఓటమిని తప్పించుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అద్భుత పోరాట పటిమతో గట్టెక్కిన ఫెడరర్.. ఏడుసార్లు మ్యాచ్ పాయింట్‌ను కాచుకొని ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. ఓ దశలో వరుసగా రెండు సెట్లు కోల్పోయినా.. తర్వాతి సెట్ టై బ్రేకర్‌లో ఏడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని అద్భుత విజయం సాధించాడు.
మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ ఫెడరర్ 6-3, 2-6, 2-6, 7-6 (10/8), 6-3 తేడాతో వందో ర్యాంకు ఆటగాడు టెన్నిస్ సాండ్‌గ్రెన్ (అమెరికా)పై మూడున్నర గంటలు పోరాడి గెలిచాడు. ఈ టోర్నీలోని మూడో రౌండ్‌లో జాన్ మిల్‌మన్ (ఆ్రస్టేలియా)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమికి రెండు పాయింట్ల దూరంలో నిలిచి గట్టెక్కిన ఫెడరర్.. క్వార్టర్ ఫైనల్లో ఏకంగా ఏడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. 22 ఏళ్ల కెరీర్‌లో ఫెడరర్ ఏడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని విజయాన్ని అందుకోవడం ఇది రెండోసారి మాత్రమే.
మరో క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ నొవాక్ జకోవిచ్ 6-4, 6-3, 7-6(7/1) తేడాతో మిలోస్ రవోనిక్ (కెనడా)పై గెలిచి ఎనిమిదోసారి సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన ఏడుసార్లూ జొకోవిచ్ టైటిల్‌తో తిరిగి వెళ్లడం విశేషం. ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన ఫెడరర్ గురువారం జరిగే సెమీఫైనల్లో జొకోతో తలపడనున్నాడు.
ఫెడరర్‌తో ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 26-23తో ఆధిక్యంలో ఉన్నాడు.
మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆ్రస్టేలియా), 14వ సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరారు. క్వార్టర్ ఫైనల్స్‌లో బార్టీ 7-6 (8/6), 6-2తో ఏడో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై.. సోఫియా 6-4, 6-4తో ఆన్స్ జెబూర్ (ట్యూనిషియ)ఫై గెలుపొందారు. సెమీస్‌లో గురువారం పరస్పరం తలపడనున్నారు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్ (భారత్)-జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) జంట పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్‌లో పేస్-ఒస్టాపెంకో ద్వయం 2-6, 5-7తో జేమీ ముర్రే (బ్రిటన్)-బెథానీ మాటెక్ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయారు.