Australian Open: టెన్నిస్ కోర్టులో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను తలపించేలా హై టెన్షన్ నెలకొంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సెమీఫైనల్ పోరులో క్రీడా స్ఫూర్తి కంటే రాజకీయ సెగలే ఎక్కువగా కనిపించాయి. ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలినా స్విటోలినా, బెలారస్ స్టార్ అరీనా సబలెంకా మధ్య జరిగిన ఈ మ్యాచ్ క్రీడాభిమానులను విస్మయానికి గురిచేసింది. సాధారణంగా టెన్నిస్ మ్యాచ్ ప్రారంభానికి ముందు, ముగిసిన తర్వాత ఆటగాళ్లు నెట్ వద్ద చేతులు హ్యాండ్‌షేక్ ఇవ్వడం ఆనవాయితీ. కానీ ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్‌లో ఈ సంప్రదాయం కనుమరుగైంది.
ఫొటోలకు దూరం.. షేక్ హ్యాండ్‌కు నో!
వరల్డ్ నంబర్-1 అరీనా సబలెంకా మ్యాచ్ ప్రారంభానికి ముందు సంప్రదాయబద్ధంగా ఫొటోల కోసం సిద్ధమవ్వగా.. ఎలినా స్విటోలినా ఆమెతో కలిసి ఫొటో దిగడానికి నిరాకరించారు.ఆ తర్వాత నెట్ దగ్గరకు వచ్చినప్పటికీ.. ఇద్దరూ కనీసం కళ్లలోకి చూసుకోలేదు, షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా, బెలారస్ క్రీడాకారులతో చేతులు కలపకూడదనే ఉక్రెయిన్ ప్లేయర్ల నిర్ణయంలో భాగంగానే స్విటోలినా ఇలా చేశారు.

ఎందుకు ఈ నిర్ణయం?
రష్యాకు బెలారస్ మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఆ దేశ క్రీడాకారులతో చేతులు కలపడం తమ దేశ ప్రజలను అవమానించడమేనని స్విటోలినా భావిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఉక్రెయిన్ పక్షాన ఒక బలమైన రాజకీయ సందేశాన్ని ఇస్తున్నట్లు ఆమె గతంలోనే స్పష్టం చేశారు.
కోర్టులో వాగ్వివాదం.. నిలిచిపోయిన ఆట
కేవలం షేక్ హ్యాండ్ విషయంలోనే కాకుండా, మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక ర్యాలీ సమయంలో సబలెంకా గట్టిగా అరవడంతో, అంపైర్ దానిని 'హిండ్రెన్స్' (ఆటకు ఆటంకం)గా పరిగణించి పాయింట్ కట్ చేశారు. అంపైర్ నిర్ణయంపై సబలెంకా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వీడియో రివ్యూ కావాలని పట్టుబట్టి అంపైర్‌తో వాదించడంతో ఆట కాసేపు నిలిచిపోయింది. దీంతో మైదానంలో వాతావరణం మరింత వేడెక్కింది.
ఫైనల్లో సబలెంకా.. చరిత్ర సృష్టించిన బెలారస్ స్టార్
ఇదిలా ఉండగా.. మహిళల సింగిల్స్ సెమీఫైనల్‌లో ఎలినా స్విటోలినాపై ఘనవిజయం సాధించి అరీనా సబలెంకా వరుసగా నాలుగోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రాజకీయ ఉద్రిక్తతల మధ్య సాగిన ఈ పోరులో సబలెంకా తన దూకుడుతో అభిమానులను అలరించింది. రొడ్ లేవర్ ఎరీనాలో జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో సబలెంకా 6-2, 6-3 తేడాతో స్విటోలినాను మట్టికరిపించింది. కేవలం 1 గంట 16 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ గెలుపుతో సబలెంకా ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఓపెన్ ఎరాలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరుసగా నాలుగు సార్లు ఫైనల్‌కు చేరిన మూడో క్రీడాకారిణిగా నిలిచింది.