జోకోవిచ్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం.. వీసా మ‌ళ్లీ రద్దు

ఆస్ట్రేలియా: వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1, మాజీ ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ ఛాంపియ‌న్ నోవాక్ జోకోవిచ్ ఏ ముహుర్తాన ఆస్ట్రేలియా విమానం ఎక్క‌డో కానీ అన్ని అడ్డంకులే ఎదుర‌వుతున్నాయి. ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టులో అడుగు పెట్ట‌గానే అక్క‌డి ప్ర‌భుత్వం జోకోవిచ్ వీసాను ర‌ద్దు చేసింది. దీంతో జోకోవిచ్ కోర్టులో న్యాయ‌పోరాటం చేసి త‌న వీసాను పున‌రుద్ధరింప చేసుకున్నాడు. కానీ ఎట్టి ప‌రిస్థితుల్లో జోకోవిచ్‌ను తేలికగా వ‌దిలి పెట్ట‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం అత‌నికి మ‌రో సారి షాకిచ్చింది. జోకోవిచ్ వీసాను మళ్లీ ర‌ద్దు చేసింది. ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేష‌న్ మంత్రి అలెక్స్ హాకే త‌న సొంత అధికారాల‌ను ఉప‌యోగించి వీసాను ర‌ద్దు చేశారు.

ప్రజా ప్రయోజనాల దృష్యా జోకోవిచ్ వీసాను రెండో సారి ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. దీంతో ఆస్ట్రేలియా నిబంధ‌న‌ల ప్ర‌కారం జోకోవిచ్ మ‌రో మూడేళ్ల పాటు ఆస్ట్రేలియాలో అడుగు పెట్ట‌డానికి వీలు లేదు. దీంతో చేసేదేమి లేక ఆస్ట్రేలియా ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ జోకోవిచ్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు ఇంజెక్ష‌న్ కోసం కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు. దీంతో ఇప్పుడు కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

దీంతో ఈ నెల 17 నుంచి మెల్‌బోర్న్ వేదిక‌గా ప్రారంభం కానున్న ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో జోకోవిచ్ పాల్గొనే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ఒక వేల ఈ లోగా కోర్టు జోకోవిచ్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తే ఆడే అవ‌కాశం ఉంటుంది. అయితే ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌కు సంబంధించిన డ్రాను గురువారం తీశారు. ఇందులో జోకోవిచ్ పేరు కూడా ఉంది.

డ్రా ప్ర‌కారం జోకోవిచ్ తొలి రౌండ్లో త‌న దేశానికే చెందిన ఆట‌గాడితో త‌ల‌ప‌డ‌నున్నాడు. అయితే గురువారం తీసిన డ్రాలో జోకోవిచ్ పేరు కూడా ఉండ‌డంతో అత‌నికి వీసా స‌మ‌స్య‌లు తొల‌గిపోయాయ‌ని అంతా భావించారు. కానీ తాజాగా మ‌రో సారి వీసాను ర‌ద్దు చేసి జోకోవిచ్‌కు ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం గ‌ట్టి షాక్ ఇచ్చింది.

అస‌లు ఏం జ‌రిగిందంటే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొన‌డానికి ఈ నెల 5న జోకోవిచ్ మెల్‌బోర్న్ విమానాశ్ర‌యంలో దిగాడు. కానీ అక్క‌డ అధికారులు జోకోవిచ్‌కు షాకిచ్చారు. క‌రోనా వ్యాక్సిన్ తీసుకోక‌పోవ‌డానికి గ‌ల స‌రైన కార‌ణాలు చూప‌లేదంటూ అత‌ని వీసాను ర‌ద్దు చేశారు. దీంతో త‌న‌కు న్యాయం చేయాలంటూ ఈ ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ ఆస్ట్రేలియా కోర్టును ఆశ్ర‌యించాడు.

గ‌త నెల‌లో తాను క‌రోనా బారిన ప‌డ్డాన‌ని, అందుకే వ్యాక్సిన్ వేసుకోలేక పోయాన‌ని, వైద్యులు కూడా ఆ స‌మ‌యంలో వ్యాక్సిన్ వేసుకోకూడ‌ద‌ని సూచించార‌ని త‌న గోడు వెల్ల‌బోసుకున్నాడు. జోకోవిచ్ చెప్పిన దాంతో సంతృప్తి వ్య‌క్తం చేసిన న్యాయ‌మూర్తి అత‌ని వీసాను పున‌రుద్ద‌రింపు చేయాల‌ని ఆదేశించాడు. కానీ ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం మ‌రోసారి వీసా ర‌ద్దు చేయ‌డంతో జోకోవిచ్‌కు క‌ష్టాలు తప్ప‌డం లేదు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, January 14, 2022, 14:12 [IST]
Other articles published on Jan 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X