హైదరాబాద్: ఆసియా గేమ్స్ టెన్నిస్‌లో
భారత్ అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగనుంది. లియాండర్ పేస్, సానియా మిర్జా, రోహన్ బోపన్న ఆసియా గేమ్స్‌కు దూరమయ్యారు. ఇందుకు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) కూడా అనుమతిచ్చింది.
కేరీర్ ముఖ్యం ఆసియా క్రీడల నుంచి తప్పుకుంటున్నా అని తొలుత సోమ్‌దేవ్ దేవ్ వర్మన్ అన్నప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసిన ఐటా ఇప్పుడు ఆటగాళ్ల అభిప్రాయాలను గౌరవిస్తున్నట్లు తెలిపింది. "ఏటీపీ, డబ్యూటీఏ టూర్లలో ఆడేందుకు క్రీడాకారులను అనుమతిస్తున్నాం. సానియా మిర్జా, లియాండర్ పేస్, రోహన్ బోపన్న పూర్తి అంకిత భావంతో దేశం తరుపున ఎన్నో టోర్నీలు ఆడారు. విజయాలు సాధించారు. లియాండర్ పేస్ టాప్ 10 ర్యాంకులో ఉండాల్సిన ఆటగాడు 35 కు పడిపోయాడు. అతను తన ర్యాంక్‌ను మెరుగు పరుచుకోవాలి. సానియా మీర్జాది అదే పరిస్దితి. కారాబ్లాక్‌తో కలిసి ఆమె ఏడో ర్యాంక్ లో ఉంది. డబ్యూటీఏ టూర్ ఫైనల్ రేసులో ఉంది. ఒకవేళ ఆ టోర్నీకి సానియా అర్హత సాధిస్తే అది మన అందరికీ గర్వకారణం అని ఐటా అధ్యక్షడు అనిల్ ఖన్నా చెప్పాడు.

ఆసియా గేమ్స్ నుంచి తప్పుకోవడానికి కారణాలను లియాండర్ పేస్ వివరించాడు. "టెన్నిసే నాకు తిండిపెడుతోంది. ఇక్కడ ర్యాంకే ముఖ్యం. అది 35కు పడిపోయింది. వచ్చే ఏడాది నాకు ఉద్యోగ భద్రత కావాలంటే ర్యాంక్ మెరుగుపరచుకోవాలి. అంటే వీలైనన్ని టోర్మీలు ఆడాలి. ఆసియా గేమ్స్ సమయంలో కీలకమైన టోక్యో, కౌలాలంపూర్ టోర్నీలున్నాయి. 24ఏళ్లకు పైగా దేశానకి ఆడాను. కెరీర్ పరంగా టోక్యో, కౌలాలంపూర్ టోర్నీలు నాకు చాలా కీలకం" అని పేస్ అన్నాడు.
ఇక రోహాన్ బోపన్న ఆసియా గేమ్స్ నుంచి తప్పుకోవాలన్నది కఠిన నిర్ణయమన్నాడు. "ఇంతకు మందు దేశానికి ప్రాతినిథ్యం వహించాం. ఈ సారి తప్పనిసరి పరిస్దితుల్లో తప్పుకుంటున్నాం" అని బోపన్న చెప్పాడు. మరోవైపు మోకాలి గాయం కారణంగా బ్యాడ్మింటన్ క్రీడా కారిణి జ్వాలా గుత్తా కూడా ఆసియా గేమ్స్ నుండి తప్పుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు దక్షిణకొరియాలోని ఇంచియాన్ వేదికగా జరగనున్నాయి.