US Open 2025: మహిళల టెన్నిస్ లోకంలో తన సత్తా చాటుతున్న ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి అరియానా సబలెంకా వరుసగా రెండో సారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. శనివారం ఫైనల్ మ్యాచ్‌లో అమెరికా క్రీడాకారిణి అమండా అనిసిమోవాను 6-3, 7-6(3) వరుస సెట్లలో ఓడించి తన కెరీర్‌లో నాలుగోసారి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆర్దర్ ఆష్ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థి అనిసిమోవాకు షాక్ ఇచ్చింది.
ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లో ఓటమి తర్వాత సబలెంకాకు గ్రాండ్ స్లామ్ గెలిచే అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సబలెంకా అనిసిమోవా కలను చెదరగొట్టింది. గతంలో అరియానా సబలెంకా, అనిసిమోవాలు 9 సార్లు తలపడ్డారు. అనిసిమోవా 9 సార్లు గెలవడం గమనార్హం. ఇందులో వింబుల్డన్ సెమీ ఫైనల్‌లో కూడా గెలిచింది. అయినప్పటికీ సబలెంకా తన అనుభవాన్ని ఉపయోగించి అనిసిమోవాను తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవకుండా ఆపింది. అరియానా సబలెంకా గ్రాండ్ స్లామ్ ఫైనల్ లో ఆడటం ఇది 7వ సారి.

టై-బ్రేక్‌లో సబలెంకా ఆధిపత్యం
నిజానికి ఈ మ్యాచ్ ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగింది. అయితే అరియానా సబలెంకా టై-బ్రేక్‌లో ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. సబలెంకా వరుసగా 19వ టై-బ్రేక్‌ను 7/3తో గెలిచి, కేవలం 1 గంట 34 నిమిషాల్లో మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకుంది. అనిసిమోవా కీలక సమయాల్లో బ్రేక్ పాయింట్లను సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరోవైపు సబలెంకా 6 బ్రేక్ పాయింట్లలో 5 సద్వినియోగం చేసుకుంది. అరియానా సబలెంకా తొలి సెట్‌లో 6-3 తేడాతో ఈజీగా గెలిచింది. కానీ రెండో సెట్‌లో అనిసిమోవా గట్టి పోటీనిచ్చింది. సబలెంకా 5-4 ఆధిక్యంతో విజయం సాధించేందుకు సర్వ్ చేస్తున్నప్పుడు.. అనిసిమోవా అద్భుతంగా ఆడి బ్రేక్ చేసి స్కోరును సమం చేసింది. ఆ సమయంలో మ్యాచ్ మూడో సెట్‌కు వెళ్తుందా అని అందరూ భావించారు. కానీ టై-బ్రేక్‌లో సబలెంకా మళ్లీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి 6-1తో ఆధిక్యంలోకి వెళ్లి సులువుగా మ్యాచ్‌ను గెలుచుకుంది.
రికార్డు సృష్టించిన సబలెంకా
యూఎస్ ఓపెన్‌లో అరియానా సబలెంకా రికార్డు సృష్టించింది. వరుసగా రెండు యూఎస్ ఓపెన్ టైటిళ్లు గెలిచిన తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. గతంలో 2012-2014 మధ్య సెరెనా విలియమ్స్ ఈ ఘనత సాధించగా.. తాజాగా సబలెంకా ఆ ఘనతను కైవసం చేసుకుంది. ఈ విజయంతో అరియానా సబలెంకా మహిళల టెన్నిస్ లో అగ్రస్థానంలో తన స్థానాన్ని పదిలపరచుకుంది.
ప్రైజ్ మనీ ఎంతంటే?
యూఎస్ ఓపెన్ 2025లో మొత్తం ప్రైజ్ మనీ 90 మిలియన్ డాలర్లతో మునుపటి రికార్డులను బద్ధలు కొట్టింది. ఇది 2024తో పోలిస్తే 20 శాతం ఎక్కువ. యూఎస్ ఓపెన్ చరిత్రలో ఇదే అత్యధిక ప్రైజ్ మనీ.మహిళల సింగిల్స్ విజేతగా అరియానా సబలెంకా 5 మిలియన్ డాలర్ల(రూ.44 కోట్లు) ప్రైజ్ మనీ గెలుచుకుంది. ఫైనల్‌లో ఓడిపోయిన అమండా అనిసిమోవాకు 2.5 మిలియన్ డాలర్లు లభించాయి. 2024తో పోలిస్తే సింగిల్స్ విజేత, రన్నరప్‌లకు ప్రైజ్ మనీ 39 శాతం పెరిగింది.
సింగిల్స్ ప్రైజ్ మనీ వివరాలు (మహిళలు & పురుషులు):
విజేత: $5,000,000 (అరియానా సబలెంకా )
రన్నరప్: $2,500,000 ( అమండా అనిసిమోవా)
సెమీఫైనలిస్ట్‌లు: $1,260,000(జెస్సికా పెగులా) (నవోమి ఒసాకా)
క్వార్టర్ ఫైనలిస్ట్‌లు: $660,000 (కరోలినా ముచోవా, బార్బోరా క్రెజ్సికోవా, మార్కెటా వొండ్రౌసోవా)
రౌండ్ ఆఫ్ 16: $400,000
రౌండ్ ఆఫ్ 32: $237,000
రౌండ్ ఆఫ్ 64: $154,000
రౌండ్ ఆఫ్ 128: $110,000
డబుల్స్ (పురుషులు, మహిళలు) విజేత జట్లకు ఒక్కొక్కరికి 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. మిక్స్‌డ్ డబుల్స్ విజేతలకు కూడా 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ లభిస్తుంది.