దుబాయ్: దుబాయ్‌లో మరో అద్భుత నిర్మాణం ఆవిష్కృతం కానుంది. ఇప్పటికే ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణం బూర్జ్ ఖలీఫాను కలిగివున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పడు ప్రపంచంలోనే తొలిసారిగా సముద్రంలో టెన్నిస్ కోర్టును ఇక్కడ నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
పెద్ద అద్దంతో(డోమ్ మాదిరిగా) ఈ నిర్మాణం చేపట్టనున్నారు. సముద్రంలో లోపల నిర్మితమవనున్న ఈ కోర్టులో ప్రేక్షకులు టెన్నిస్ మ్యాచులు చూడొచ్చు.
కోర్టు పైన లేదా కింద భాగంలో సముద్రంలోని జీవరాశులను తిలకిస్తూ టెన్నిస్ మ్యాచులను ఆనందంగా చూడొచ్చు. ఈ అద్భుత కోర్టు నిర్మాణానికి క్రిజ్టోఫ్ కోటాలా(30) అనే పోలిష్ అర్కిటెక్ట్ స్థానిక ఆటగాళ్ల నుంచి పెట్టుబడులను సేకరిస్తున్నారు.

ఇప్పటికే బూర్జ్ అల్ అరబ్ భవనంలో ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతంలో టెన్నిస్ కోర్టును కలిగి ఉన్న దుబాయ్.. ఈ ప్రాజెక్టుతో అత్యంత లోతైన టెన్నిస్ కోర్టుకు కూడా గమ్యం కానుంది. 'ఒక్క పెట్టుబడుదారు లేనప్పటికీ ఈ నిర్మాణానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఇది ఒక మంచి ఆలోచన' అని కోటాల తెలిపారు.
టెన్నిస్ గల్ఫ్ సిటీలో సంప్రదాయ ఆటగా ఉన్నందు వల్లే దుబాయ్‌ని తన ప్రాజెక్టుకు ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. తన ప్రాజెక్టుకు దుబాయ్ సరిగ్గా సరిపోతుందని చెప్పారు. ప్రాథమికంగా తన ప్రాజెక్టుకు డిజైన్ పూర్తయిందని తెలిపారు.
సామర్థ్యమున్న పెట్టుబడిదారులు ముందుకొస్తే తన ప్రాజెక్టును మొదలుపెడతానని వివరించారు. అయితే సముద్ర లోపల నిర్మాణం కాబట్టి ఈ ప్రాజెక్టుకు అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి.