
టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్ 2020లో జర్మనీ టెన్నిస్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ సంచలన విజయం సాధించాడు. ఆదివారం జరిగిన టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో రష్యా ఆటగాడు కారన్ కచనోవ్‌పై 6-3, 6-1 తేడాతో జ్వెరెవ్ గెలుపొంది స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. దీంతో కెరీర్‌లోనే అతిపెద్ద విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. జ్వెరెవ్ కెరీర్‌లో ఇప్పటివరకూ ఒక్క గ్రాండ్‌స్లామ్ కూడా లేకపోయిన సంగతి తెలిసిందే.
గంట 19 నిమిషాల పాటు సాగిన ఫైనల్ పోరులో అలెగ్జాండర్ జ్వెరెవ్ ప్రత్యర్థి కారన్ కచనోవ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. కచనోవ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా.. దూసుకుపోయాడు. రెండు సెట్లలోనూ జ్వెరెవ్ తన బలమైన బ్యాక్‌హ్యాండ్ షాట్లతో విరుచుకుపడి తన కలను సాకారం చేసుకున్నాడు. సెమీస్‌లో అతడు దిగ్గజ ఆటగాడు నోవాక్ జకోవిచ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. జకోవిచ్ శనివారం కాంస్యం కోసం తలపడిన మ్యాచ్‌లోనూ ఓటమిపాలై తీవ్ర నిరాశకు గురయ్యాడు. స్పెయిన్‌కు చెందిన పాబ్లో బుస్టా చేతిలో 4-6, 7-6 (6), 3-6 తేడాతో ఓడిపోయాడు.
గతేడాది యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన అలెగ్జాండర్ జ్వెరెవ్.. డొమినిక్ థీమ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. అదే జ్వెరెవ్‌కు ఇప్పటివరకున్న అత్యుత్తమ ప్రదర్శన. ఆదివారం ఒలింపిక్స్ 2020 ఫైనల్స్‌లో విజయం సాధించడంతో తొలిసారి స్వర్ణ పతకం అందుకున్నాడు. ఈ విజయంతో జర్మనీ తరఫున టెన్నిస్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి స్వర్ణం సాధించిన క్రీడాకారుడిగానూ జ్వెరెవ్ రికార్డు నెలకొల్పాడు.1988లో స్టెఫీ గ్రాఫ్ మహిళల సింగిల్స్ స్వర్ణం గెలిచారు. 1992లో బోరిస్ బెకర్ మరియు మైఖేల్ స్టిచ్ పురుషుల డబుల్స్ గోల్డ్ మెడల్ గెలిచారు.