
పారిస్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ధాటికి ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ(రొలాండ్ గారోస్) ప్రేక్షకులు లేకుండా జరగొచ్చని సమాచారం తెలుస్తోంది. ఫ్రెంచ్ ఓపెన్‌ను ఈ ఏడాది ఫ్యాన్స్ లేకుండా నిర్వహించమే ఒకైక మార్గమని ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు బెర్నాడ్ ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా కారణంగా మేలో జరగాల్సిన టోర్నీని సెప్టెంబర్-అక్టోబర్‌కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.
మేలో జరగాల్సిన టోర్నీని ఎవరినీ సంప్రదించకుండా సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు వాయిదా వేసిందని ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ అధికారులపై కొందరు ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ నిర్ణయం తీసుకున్నందుకు అసలు చింతించడం లేదని బెర్నార్డ్ తెలిపారు.
'ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది టోర్నీ కోసం వేచిచూస్తున్నారు. ప్రేక్షకులు లేకుండా నిర్వహించడం కూడా ఓ రకమైన వ్యాపార నమూనాలో భాగమే. ప్రసార హక్కుల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. దాన్ని విస్మరించకూడదు' అని బెర్నార్డ్ అన్నారు. అయితే టోర్నమెంట్‌ను సెప్టెంబర్ 27వ తేదీకి వాయిదా వేస్తున్నారని వచ్చి వార్తలను ఆయన ఖండించారు. వాయిదా పడిన తేదీల్లో ఎటువంటి మార్పులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీ ఇప్పటికే రద్దు కాగా.. ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం సెప్టెంబర్‌కు వాయిదా పడింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు జరగాల్సిన యూఎస్ ఓపెన్ నిర్వహణ సందిగ్ధంలో పడింది. కరోనా కారణంగా ఇప్ప్పటికే ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇక వేసవి కాలంలో క్రికెట్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే టోర్నీ ఇండియన్ ప్రీమియర్ (ఐపీఎల్) లీగ్ కూడా కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడింది.