సిడ్నీ: ప్రస్తుత ప్రపంచ కప్ టోర్నీలో భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ లేని స్పష్టంగా కనిపిస్తోందని అభిమానులతోపాటు క్రికెట్ విశ్లేషకులు కూడా పేర్కొంటున్నారు. గురువారం జరిగిన సెమీ సైనల్ మ్యాచులో టీమిండియా పేలవ ప్రదర్శనతో ఆస్ట్రేలియాలో చేతిలో ఓటమిపాలై ప్రపంచ కప్ నుంచి నిష్ర్కమించిన విషయం తెలిసిందే. అదే ఈ మ్యాచులో యువరాజ్ సింగ్ ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని వారు పేర్కొంటున్నారు.
గత ప్రపంచ కప్ ట్రోఫీని భారత్‌కు అందించడంలో కీలక పాత్ర పోషించడంతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా యువరాజ్ నిలిచాడు. 2011లో జరిగిన ప్రపంచ కప్ ట్రోఫీని భారత్ చేజిక్కించుకోవడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో టీమిండియా ఆడిన ప్రతీ మ్యాచ్ గెలుపులోనూ యువరాజ్ ముఖ్య భూమిక పోషించాడు. అంతేగాక, మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా కూడా ఎంపికయ్యాడు. అయితే 2015 ప్రపంచ కప్ కు వచ్చేసరికి అతడ్ని పక్కన పెట్టారు.

యువరాజ్ పూర్తి ఫిట్ నెస్‌తో ఉన్నా కూడా జట్టులో స్థానం కల్పించలేదు. ఆ ఆల్ రౌండర్ లేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనబడింది. 2011 ప్రపంచ కప్‌లో యువరాజ్ బ్యాటింగ్‌లో అదరగొట్టి కప్‌ను తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించాడు. యువరాజ్ 113 పైగా సగటుతో 362 పరుగులు చేయడమే కాకుండా.. బౌలింగ్ లో 15 వికెట్లను కూడా తీశాడు. టోర్నీ ఆద్యంతం తనదైన ముద్ర వేసిన యువీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.
ఆ టోర్నమెంట్ లో ఆసీస్ తో్ జరిగిన క్వార్టర్ ఫైనల్లో యువరాజ్ 57 పరుగులతో నాటౌట్‌గా ఉండటమే కాకుండా.. రెండు కీలక వికెట్లను తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ప్రస్తుతం జట్టుకు యువరాజ్ అందుబాటులో ఉన్నా.. తుది జట్టులో ఎంపిక చేయకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. యువరాజ్ ను కాదని.. రవీంద్ర జడేజాకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు.
వరుస ఏడు మ్యాచ్ ల్లో(క్వార్టర్ ఫైనల్లో కలిపి) టీమిండియా జైత్రయాత్ర మోగించినా.. కీలకమైన సెమీఫైనల్ పోరుకు వచ్చేసరికి జట్టు పూర్తిగా చతికిలబడింది. అదే యువరాజ్ ఉండి ఉంటే అనే ప్రశ్న ఇప్పడు సగటు భారత క్రీడాభిమానికి కచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ టోర్నమెంట్ లో జడేజా అవసరం ఉందా?అంటే అది ముమ్మాటికీ కానేకాదు అనే సమాధానమే వస్తుంది. ఈ సిరీస్‌లో ఏ మ్యాచ్ ల్లో అంచనాలమేర రాణించని జడేజా నాలుగు మ్యాచ్ ల్లో 43 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు తీశాడు.