భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. తన కోసం రుచికరమైన చూర్మాను చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వంటకాన్ని అభినందించారు. అది తిన్న తర్వాత భావోద్వేగానికి గురయ్యానని, తనకు తన తల్లిని గుర్తు చేసిందని లేఖలో పేర్కొన్నారు.
జమైకా ప్రధానమంత్రి ఆండ్రూ హోల్నెస్ భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విందులో నీరజ్‌ను మోదీ కలిశారు. ఈ సందర్భంగా ప్రధానికి నీరజ్ చూర్మాను ఇచ్చారు. ఈ ఏడాది జనవరిలో తన కోసం ఇంట్లో తయారు చేసిన చూర్మా తేవాలని నీరజ్‌ను మోదీ కోరిన విషయం తెలిసిందే. మోదీ విజ్ఞప్తికి స్పందించిన నీరజ్ తల్లి సరోజ్ దేవి ప్రత్యేకంగా చేసిన చూర్మాను పంపిస్తానని హామీ ఇచ్చారు.

''చూర్మా తిన్న తర్వాత మీకు లేఖ రాయలేకుండా ఉండలేకపోయా. సోదరుడు నీరజ్ ఈ చూర్మా గురించి ఇంతకుముందు నాతో కొన్నిసార్లు చెప్పాడు. కానీ ఇప్పుడు దాన్ని తిన్న తర్వాత నేను భావోద్వేగానికి గురయ్యా. మీ అభిమానంతో కూడిన ఈ బహుమతి నాకు మా అమ్మను గుర్తు చేసింది'' అని మోదీ లేఖలో పేర్కొన్నారు.
నవరాత్రి సందర్భంగా తనకు అమ్మవారి ప్రసాదం రావడం యాదృచ్ఛికం అని చూర్మాను ప్రసాదంగా ప్రధాని మోదీ లేఖలో సంభోదించారు. ఉపవాసానికి ముందు 'చుర్మా' తన ప్రధాన భోజనంగా మారిందని తెలిపారు. నవరాత్రుల్లో మోదీ ఉపవాసం ఉండనున్నారు. ''మీరు తయారుచేసిన ఆహారం సోదరుడు నీరజ్‌కు దేశానికి పతకాలు సాధించే శక్తిని ఇచ్చినట్లుగా, ఈ చుర్మా రాబోయే తొమ్మిది రోజులు దేశానికి సేవ చేసే శక్తిని ఇస్తుంది'' అని మోదీ అన్నారు. హరియాణా, రాజస్థాన్‌లో ప్రఖ్యాత వంటకం చూర్మా.
కాగా, నీరజ్ చోప్రా ప్రస్తుతం ఎడమచేతి ఫ్రాక్చర్ నుంచి కోలుకుంటున్నాడు. గాయంతోనే డైమండ్ లీగ్ మీట్ ఫైనల్స్‌లో నీరజ్ పోటీపడిన విషయం తెలిసిందే. సెంటీమీటర్ తేడాతో టైటిల్ చేజార్చుకుని రన్నరప్‌గా నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ రజత పతకం సాధించాడు.