హైదరాబాద్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టేకిల్ తొలి మ్యాచ్ నుంచే సూపర్ డ్రామా పంచుతోంది. షో ఆరంభమైన అనౌన్స్‌మెంట్ నుంచే ప్రేక్షకులు ఉత్సాహంతో బాలయోగి స్టేడియం హీటెక్కింది. ఇక మొదటి మ్యాచ్ ఎవరిదో చూడగానే ఫ్యాన్స్ హుషారు మరింత పెరిగింది. ఈ మ్యాచ్‌లో డబ్ల్యూడబ్ల్యూఈలో బెస్ట్ ట్యాగ్ టీం ఛాంపియన్స్ కెవిన్ ఓవెన్స్, శామీ జేన్ రింగులోకి దూకారు.
వీరిని మట్టికరిపించేందుకు భారత ద్వయం వీర్ మహాన్, సంగా బరిలో దిగారు. సంగాను ఫ్యాన్స్ అందరూ కూడా ఇండస్ షేర్ అని పిలుస్తారనే సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితమే 'రా' జడ్జిమెంట్ డే పోటీల్లో కెవిన్, జేన్ ఇద్దరూ గాయపడిన సంగతి తెలిసిందే. అయినా సరే వారి సత్తా మాత్రం ఏమాత్రం తగ్గినట్లు కనిపించలేదు. ఈ సీనియర్ జోడీని ఎలాగైనా ఓడించేందుకు ఇండియన్ జోడీ రెడీ అయింది.

అయితే డబ్ల్యూడబ్ల్యూఈలో డ్రామా అంత ఈజీగా ఆగిపోతుందా? ఈ మ్యాచ్ మొదలైన రెండు నిమిషాల్లోనే ఎవరూ ఊహించని ట్విస్ట్ కనిపించింది. సడెన్‌గా జిందర్ మహాల్ రింగులోకి దూసుకొచ్చేశాడు. వచ్చీరావడంతోనే జేన్, ఓవెన్స్‌పై దాడి చేశాడు. దీంతో ఓవెన్స్, జేన్ ఓడిపోయారు. ఇది చూసిన ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. వాళ్లు మళ్లీ సీట్లలో సర్దుకునేలోపే రింగులోకి మరో స్టార్ దూసుకొచ్చాడు.
డ్రూ డ్రూ మెకింటైర్ బాణంలా స్టేజి మీదకు వచ్చి కెవిన్, జేన్‌కు అండగా నిలిచాడు. దీంతో నలుగురి మధ్య జరగాల్సిన ఈ ట్యాగ్ టీం మ్యాచ్ ఆరుగురి మధ్య మ్యాచ్‌గా మారిపోయింది. ఈ మ్యాచ్ జరుగుతోంది భారత్‌లోనే అయినా.. భారత ద్వయం వీర్ మహాన్, సంగాను ఫ్యాన్స్ సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో వాళ్లే విలన్లు. అందుకే ఇండియా జెర్సీలో దూసుకొచ్చిన డ్రూ డ్రూ మెకింటైర్, ఓవెన్స్, జేన్‌కు మద్దతిస్తూ చీర్ చేశారు.
ఇక ఈ మ్యాచ్ పీక్స్ చేరింది అనిపించినప్పుడు సడెన్‌గా మాట్ రిడిల్ ఎంట్రన్స్ మ్యూజిక్ వచ్చింది. అది చూసిన జిందర్ మహాల్ ఫోకస్ తప్పాడు. ఈ అవకాశాన్ని ఒడిసి పట్టేసిన డ్రూ.. జిందర్ మహాల్‌ను ఓడించి తమ టీంకు విజయాన్ని కట్టబెట్టాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మొత్తం ఆరుగురూ కలిసి తమ భాంగ్రా డ్యాన్స్ చేసి ఫ్యాన్స్‌ను అలరించారు. ఇది చూసిన ఫ్యాన్స్ తమ సంతోషాన్ని ఆపుకోలేక స్టేడియం దద్దరిల్లేలా చీర్ చేశారు.