పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందర్నీ ఉర్రూతలూగించే డబ్ల్యూడబ్ల్యూఈ కోసం హైదరబాద్ రెడీ అయింది. ఏడేళ్ల తర్వాత భారత్ వేదికగా డబ్ల్యూడబ్ల్యూఈ షో జరుగుతోంది. హైదరాబాద్ వేదికగా జరిగే 'డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టేకిల్'లో స్టార్ రెజ్లర్ రియా రిప్లీ తన వరల్డ్ ఛాంపియన్ టైటిల్ డిఫెండ్ చేసుకోబోతోంది. మహిళల వరల్డ్ ఛాంపియన్‌గా ఉన్న రిప్లీతో నటాల్యా పోటీ పడుతోంది.
రిప్లీని ఈసారి ఎలాగైనా ఓడించి ఛాంపియన్‌షిప్ లాగేసుకోవాలని నటాల్యా అనుకుంటోంది. ఈ రెజ్లింగ్ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. అంతేకాదు, ఈ పోటీల్లో పాల్గొనేందుకు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్, హాలీవుడ్ యాక్టర్ జాన్ సీనా కూడా వస్తుండటం గమనార్హం. కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్ని జాన్ సీనా స్వయంగా వెల్లడించాడు. భారత్ వచ్చేందుకు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నానంటూ ట్వీట్ చేశాడు.

ఈ పోటీల కోసం హైదరాబాద్ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. శుక్రవారం జరిగే ఈ పోటీలకు భారీ సంఖ్యలో డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ వస్తారని అంచనా. ఈ షోలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 28 మంది డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లు పాల్గొంటారు. భారత్‌లో ఈ షో జరగడం ఇది కేవలం రెండోసారి మాత్రమే కావడం గమనార్హం. హైదరాబాద్‌లో జరిగే డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టేకిల్‌లో ప్రస్తుత వరల్డ్ హెవీవైట్ ఛాంపియన్ సేత్ 'ఫ్రీకిన్' రోలిన్స్ తలపడనున్నాడు..
డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీం ఛాంపియన్లు సామి జాయన్, కెవిన్ ఓవెన్స్.. వీరితోపాటు ఫ్యాన్ ఫేవరెట్లు జిందర్ మహల్, డ్రూ మెకింటైర్, బెక్కీ లించ్, మ్యాట్ రిడిల్, లూడ్‌విగ్ కైసర్ తదితరులు హైదరాబాద్ వచ్చేశారు. ఈ షోకు సంబంధించిన టికెట్లను బుక్‌మైషో యాప్ లేదా www.bookmyshow.com వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఈ షో సోనీ స్పోర్ట్స్‌లో ప్రసారం అవుతుంది.