డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టేకిల్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రముఖ రెజ్లర్, హాలీవుడ్ యాక్టర్ జాన్ సీనాను స్టార్ యాక్టర్ కార్తీ కలిశాడు. భాగ్యనగరంలోని బాలయోగి స్టేడియంలో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టేకిల్ ప్రోగ్రాం జరిగిన సంగతి తెలిసిందే. ఈ షో చివరి మ్యాచ్‌లో జాన్ సీనా పాల్గొన్నాడు. ప్రస్తుతం డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్‌గా ఉన్న సెత్ రోలిన్స్‌తో కలిసి ట్యాగ్ టీం మ్యాచ్ ఆడాడీ లెజెండ్.
ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన అతన్ని కార్తీ కలిశాడు. ఈ సందర్భంగా జాన్ సీనాతో ఉన్న ఫొటోను షేర్ చేసిన అతను.. 'జాన్ సీనా, నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఇంత మంచిగా రిసీవ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఆ కొన్ని క్షణాల్లోనే అందరూ స్పెషల్ అనే ఫీలింగ్ కలిగించావ్. అది నీకు మాత్రమే సాధ్యం' అని కార్తీ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్టు పెట్టాడు.

ఇది చూసిన ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు. ఒక సినిమాలో యాక్ట్ చేస్తాడేమో కనుక్కోకపోయావా? అని అడుగుతున్నారు. కొంతకాలంగా డబ్ల్యూడబ్ల్యూఈకి దూరంగా ఉంటున్న ఈ లెజెండరీ రెజ్లర్.. హాలీవుడ్‌లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా 'ది సూసైడ్ స్క్వాడ్' చిత్రంలో పీస్ మేకర్ పాత్రలో జాన్ సీనా అందర్నీ ఆకట్టుకున్నాడు.
దీంతో అతనితో ప్రత్యేకంగా పీస్ మేకర్ అనే సిరీస్ కూడా చేశారు. ఇది కూడా ఫ్యాన్స్‌ను తెగ అలరించింది. సూపర్ హీరో ఫ్యాన్స్ తప్పక చూడాల్సిన సిరీసుల లిస్టులో చేరింది. ఇలా డబ్ల్యూడబ్ల్యూఈకి దూరంగా ఉంటున్నా కూడా.. భారత్‌లో ప్రోగ్రాం అనగానే జాన్ సీనా ఒప్పుకోవడం గమనార్హం. ఇక్కడకు వచ్చేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని కొన్నిరోజుల క్రితం ట్వీట్ చేశాడు.
ఇక ఈ షో ముగింపులో మాట్లాడుతూ.. తను ఈ క్షణం కోసం 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. ఇలా అందరి ముందు నిలబడే అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. తమ ఫేవరెట్ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ ఇలా ఎమోషనల్ అవడంతో ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. 'జాన్ సీనా.. జాన్ సీనా..' అంటూ స్టేడియాన్ని హోరెత్తించారు.