హైదరాబాద్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ హీట్ పీక్స్‌కు చేరింది. ప్రఖ్యాత రెజ్లర్ జాన్ సీనా కూడా నగరానికి చేరుకున్నాడు. అతనికి నగరంలో అద్భుతమైన ఆరంభం దక్కింది. ఇక్కడి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టేకిల్ షో జరుగుతున్న సంగతి తెలిసిందే. సుమారు ఏడేళ్ల తర్వాత మళ్లీ డబ్ల్యూడబ్ల్యూఈ మన దేశానికి వచ్చింది. ఈ సందర్భంగా ఈ షోకు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది.
ఈ షో కోసం హైదరాబాద్ చేరుకున్న జాన్ సీనాను ఎయిర్‌పోర్టులో చూసిన అభిమానులు చీర్ చేస్తూ అతనికి స్వాగతం పలికారు. తెల్ల టీషర్ట్, బ్లాక్ షార్ట్స్, క్యాప్‌తో వచ్చిన జాన్ సీనాకు విమానాశ్రయంలో చాలా కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. హోటల్‌లో అతని మెడలో బంతిపూల దండ వేసి ఆహ్వానించారు. కొన్నిరోజుల క్రితమే తను డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టేకిల్ కోసం హైదరాబాద్ వస్తానని జాన్ సీనా ప్రకటించిన సంగతి తెలిసిందే.

భారత్ వచ్చేందుకు తాను చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని జాన్ సీనా కొన్ని రోజుల క్రితం ఎక్స్‌లో (గతంలో ట్విట్టర్) పోస్టు పెట్టాడు. ఇప్పుడు నగరానికి చేరుకున్న జాన్ సీనాకు ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే వెల్‌కం లభించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మెడలో పూలదండ వేసుకున్న జాన్ సీనా తన హోటల్‌లోకి వెళ్తూ కనిపిస్తున్నాడు.
ఈ షోలో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్స్ అయిన జాన్ సీనా, జిందర్ మహల్, ఇండస్ షేర్, నటాల్య తదితరులు తమ అద్భుతమైన టెక్నిక్‌తో అందర్నీ కట్టిపడేయడనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని పొందిన డబ్ల్యూడబ్ల్యూఈలో ఈ సారి భారత రెజ్లర్లతో పాటు ఇతర దేశాలకు చెందిన ప్రముఖ రెజ్లర్లు సత్తాచాటేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే తన వైవిధ్యమైన ఆటతీరుతో లెక్కకు మిక్కిలి టైటిళ్లు కొల్లగొట్టిన జాన్‌సేనా..ఫ్రీకిన్ రోలిన్స్ జతగా బరిలోకి దిగుతున్నాడు.
వీరిద్దరు గివోని విన్సీ, లుడ్విగ్ కైసర్‌తో అమీతుమీ తేల్చుకోనున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ టైటిల్ కోసం ఇండస్ షేర్(సంగా, వీర్), కెవిన్ ఒవెన్స్, సమి జైన్ మధ్య ఫైట్ జరుగుతుంది. మహిళల డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ టైటిల్ కోసం రియా రిప్లే, నటాల్యతో అమీతుమీ తేల్చుకోనుంది. వీరితో పాటు డ్రూ మెక్‌లెట్రీ, షాంకీ, రింగ్ జనరల్ గుంతర్, జియోనీ విన్సీ బరిలో దిగనున్నారు.