డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టేకిల్ ఓ రేంజ్‌లో జరిగింది. చివరి మ్యాచ్‌లో జాన్ సీనా, సెత్ రోలిన్స్ జోడీ అద్భుతమైన పోరాటంతో విజయం సాధించారు. భారత్‌లో జాన్ సీనా తొలి మ్యాచ్ ఇదే. మరి అతని ఫ్యాన్స్ ఊరికినే ఉంటారా? జాన్ సీనా ఎంట్రీ నుంచి స్టేడియం దద్దరిల్లేలా చీర్ చేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలో జాన్ సీనాకు దక్కిన అతి గొప్ప క్రౌడ్ రియాక్షన్స్‌లో ఇదొకటని చెప్పాలి.
ఇక ఈ మ్యాచ్‌లో ప్రస్తుత వరల్డ్ హెవీవైట్ ఛాంపియన్ సెత్ రోలిన్స్‌తో జతకట్టిన జాన్ సీనా.. విన్సి, కైజర్ జోడీని ఎదుర్కొన్నాడు. మ్యాచ్ మొదలైన రెండు నిమిషాల్లోనే రోలిన్స్.. సీనాను ట్యాగ్ చేసి రింగులోకి పిలిచాడు. దీంతో ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం పెరిగింది. అయితే ఆ తర్వాత విన్సి, కైజర్ జోడీ అద్భుతంగా పోరాడి సీనా, రోలిన్స్‌ను ఓడించినంత పనిచేసింది. కానీ పట్టుదలగా పోరాడిన సీనా, రోలిన్స్ చివరకు పైచేయి సాధించారు.

చివర్లో తన ట్రేడ్ మార్క్ ఆల్టిట్యూడ్ అడ్జస్ట్‌మెంట్ (ఏఏ) షాట్‌తో సీనా ఈ మ్యాచ్ ముగించాడు. చివర్లో మాట్లాడిన సీనా.. 'గత 20 ఏళ్లుగా ఈ క్షణాన్ని ఊహించుకుంటూనే ఉన్నా. మీ అందరి ముందు ఇలా నిలబడే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్' అని చెప్పాడు. ఇది విన్న ఫ్యాన్స్ అందరూ 'జాన్ సీనా' నినాదాలతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఇక చివర్లో రోలిన్స్, సీనా ఇద్దరూ కౌగిలించుకొని స్టేజ్‌ని వీడారు.
ఇక మహిళల వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో రియా రిప్లీ కూడా అద్భుతంగా ఆడింది. జోయీని ఓడించి ఈ మ్యాచ్‌కు వచ్చిన నటాల్యాతో గట్టిగా పోరాడి విజయం సాధించింది. మిగతా మ్యాచుల్లో గంథర్, కెవిన్ ఓవెన్స్, శామీ జేన్, బ్రాన్ బ్రేకర్ విజయాలు సాధించారు. సీనా ప్రసంగంతో హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మోస్ట్ ఎవైటెడ్ ప్రోగ్రాం ముగిసింది. ఫ్యాన్స్ అందరూ దీన్ని తెగ ఎంజాయ్ చేశారు.